అంకూరు గ్రామంలో 5వ. విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్నిప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది:03.06.2022, వనపర్తి.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
శుక్రవారం వనపర్తి మండలం అంకూరు గ్రామంలో 5వ. విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలలో పల్లె ప్రగతి ద్వారా ఏర్పాటుచేసిన వైకుంఠ ధామాలను వినియోగించుకోవాలని, అంకూర్ గ్రామానికి రైతు బంధు ద్వారా ఇప్పటివరకు 556 మంది రైతులకు రూ.3,20,83,796/- లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని ఆయన అన్నారు. అంకూర్ గ్రామానికి, గ్రామ పరిశుభ్రతకు రూ.62 లక్షల 45 వేల 780 లు అందించినట్లు మంత్రి వివరించారు. సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సాధిస్తున్నామని, ప్రజలు అభివృద్ధి పనులలో పాలుపంచుకోవాలని ఆమె అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలలో పర్యటించాలని, గ్రామాలలో ఉన్న సమస్యలను ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి, దాని ప్రకారం అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు. హరితహారం కింద నాటిన మొక్కలను విరివిగా నాటి, వాటిని సంరక్షించాలి అని ఆమె అన్నారు. చెట్లను ఎక్కువగా పెంచినట్లయితే భూగర్భ జలాలు పెరుగుతాయని, అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చునని ఆమె సూచించారు. త్రాగునీరు, విద్యుత్తు, రోడ్లు. పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు ఆమె ఆదేశించారు. ఈ నెల 18వ తేదీ వరకు నిర్వహించనున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
అనంతరం పెద్దగూడెం, వనపర్తి మున్సిపాలిటీ లోని 32 వ వార్డులో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల లోని వ్యవసాయ భూములలో ఎక్కడా కంపతార చెట్లు ఉండొద్దనీ, ఎన్ని గ్రామ పంచాయతీలు కంపతార చెట్లు లేకుండా చేస్తే అన్ని గ్రామ పంచాయతీలకు రూ. లక్ష అందిస్తానని మంత్రి వివరించారు. గ్రామాల్లో ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు గ్రామ పంచాయతీలకు నిధులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు ఏర్పాటుతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు రూ.8,500 వేతనాలు, పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్, ఆటోలు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. 15 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గల్లీ తిరిగి అధికారులు, ప్రజలు సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.
అంతకుముందు వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 118 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.32,35,500 విలువైన చెక్కులను అందజేసి, మంత్రి వారితో అల్పాహారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, అధికారులు, గ్రామ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post