అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం అందించడానికి దక్షిణ పవర్ గ్రిడ్ తో ఒప్పందం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

అంగన్ వాడి కేంద్రాలలో పిల్లలకు పోషకాహార అనుబంధ ఆహారం, ప్రాథమిక కనీస కిట్ ల సరఫరాకు పవర్ గ్రిడ్ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో పవర్ గ్రిడ్ సీనియర్ జనరల్ మేనేజర్ (HR) జి.వి.రావు, నిజామాబాద్ డీ.జీ.ఎం. పి.శ్రీధర్, కలెక్టర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. జిల్లాలోని బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ, జైనథ్, నేరడిగొండ మండలాల్లోని 160 అంగన్ వాడి కేంద్రాలలో 3 నుండి 6 సంవత్సరాల వయసు కలిగిన 3200 మంది పిల్లలకు వేడిగా వండిన చిరు ధాన్యాల భోజనం, ఇప్పపువ్వు లడ్డులను అనుబంధ పోషకాహారం కింద వారానికి మూడు సార్లు అందించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఈ ప్రాజెక్టు ప్రాథమిక పాఠశాలలకు కనీస కిట్లు, పిల్లలకు ప్రీ స్కూల్ యూనిఫామ్, అంగన్ వాడి కేంద్రాలకు కనీస కిట్ లను అందించడం జరుగుతుందని తెలిపారు. ముడి పదార్థాలు సరఫరాకు జిల్లాలోని స్థానిక రైతులకు సహజ సేద్యానికి ప్రోత్సహిస్తూ సహకారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎరువులు, పురుగులమందులు ఉపయోగించకుండా సహజ వ్యవసాయ పద్దతుల ద్వారా సాగు చేయబడిన చిరుధాన్యాలు సేకరించడం జరుగుతాయని తెలిపారు. ఆదివాసీ మహిళల సహకారంతో అంగన్ వాడి కేంద్రాలకు ఇప్పపువ్వు లడ్డులను సేకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు మండలాల్లోని 160 అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అనుబంధ పోషకాహారం, ప్రాథమిక కిట్ లను కార్పొరేట్ సంస్థల సామజిక బాధ్యతల క్రింద 99.64 లక్షల రూపాయలతో దక్షిణ ప్రాంతం-1 పవర్ గ్రిడ్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని సీనియర్ జనరల్ మేనేజర్ జీ.వీ.రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సాంప్రదాయ చిరుధాన్యాల వేడి ఆహారం, ఇప్పపువ్వు లడ్డులు అందించడం, సాంప్రదాయ ఆహార ఉత్పత్తులకు రైతులకు, గిరిజన మహిళలకు ప్రోత్సాహం కల్పించడం, పిల్లల ఆరోగ్య అంశాలను మెరుగు పరచడం, అంగన్వాడీ కేంద్రాల అలవాట్లను ప్రోత్సహించడం, పర్యావరణ పరంగా, ఆర్థిక పరంగా రైతుల పంట మార్పిడికి ప్రోత్సహించడం, ఇప్పపువ్వు లడ్డు తయారుకు గిరిజన మహిళలకు సాంప్రదాయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయడం, జిల్లాలో పచ్చదనం పెంచడానికి ఇప్పపువ్వు మొక్కలను నాటి సంరక్షించడం జరుగుతుందని తెలిపారు. సాంప్రదాయ ఆహార వంటకాలను పునరుద్ధరించడం ద్వారా ఆహార వారసత్వాన్ని సంరక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పవర్ గ్రిడ్ పౌర సంబంధాల అధికారి వి.శ్రీకాంత్ పాల్గొన్నారు.

Share This Post