అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను ఆరోగ్యవంతులుగా తయారు చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 08, 2021ఆదిలాబాదు:-

            అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను ఆరోగ్యవంతులుగా తయారుచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున ఆదిలాబాద్ పట్టణంలో గల సుందరయ్య నగర్ లోని పట్టణ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, సరుకుల గదిలోని పాలు, నూనె, తదితర సామాగ్రిని, వంటగదిని, పిల్లల ఆటవస్తువులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా అంగన్వాడీ కేంద్రాలు పని చేయలేదని, అయినప్పటికీ గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం ఇంటికి సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభం అయిన దృష్ట్యా ఆయా కేంద్రాల పరిధిలోని పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా చూడాలని అన్నారు. పిల్లల బరువు, ఎత్తు, ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించి విద్యాబుద్ధులు నేర్పించాలని అన్నారు. ప్రతి ఒక పిల్లల వివరాలను సంబంధిత నమోదు చేయాలనీ అన్నారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్ లను కలెక్టర్ పరిశీలించారు. పిల్లల సంఖ్యా పెంచే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అంగన్వాడీ టీచర్ రాధ ను ఆదేశించారు. పిల్లల బరువును, ఎత్తును పరిశీలించారు. అనంతరం పిల్లలు నేర్చుకున్న ఆటాపాటలను తిలకించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, సూపర్ వైజర్ ఫరా, ఆశా వర్కర్, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post