*ప్రచురణార్థం-3*
*అంగన్వాడీ కేంద్ర భవనాల మరమ్మత్తులు, పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*
జయశంకర్ భూపాలపల్లి, మే 12: నీతి ఆయోగ్ ద్వారా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి చేపట్టిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన అంగన్వాడీ కేంద్ర భవనాల మరమ్మత్తులు, పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో స్వంత భవనాలు ఉన్న 117 అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తులు, పునర్నిర్మాణ, మౌళిక సదుపాయాల కల్పనకు రూ. 10 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. ఇట్టి పనులు పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టుటకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన అన్నారు. పనులు త్వరితగతిన పూర్తికి క్షేత్ర పరిశీలనకు మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులకు బాధ్యులను చేసినట్లు ఆయన అన్నారు. మంజూరయిన పనుల్లో కేవలం 12 చోట్ల మాత్రమే పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పనులు ఇంకనూ ప్రారంభించని చోట్ల వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల పూర్తికి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర టీఎస్, పీఆర్ ఇఇ ఏ. వెంకటేశ్వర్లు, డిఇ లు, ఎఇ లు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.