అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వేడుకలలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, పాల్గొన్న DWO PD పద్మవతి. ( కరీంనగర్ జిల్లా )

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సకలాంగులతో సమానంగా సమాజంలో ముందుకు సాగాలి

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

దివ్యాంగులకు అవసరమైన  పరికరాలను త్వరలో అందిస్తాం

అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

0000

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించుటకు ముందుకు సాగాలని అన్నారు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత, నైపుణ్యం ఉంటుందని దివ్యాంగులలో ఎంతో నైపుణ్యం గల వారు ఉన్నారని అన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించుటకు వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకాదని పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారని అన్నారు. ప్రభుత్వపరంగా దివ్యాంగులకు ఎన్నో సంక్షేమ అభివృద్ది పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 21,139 మంది దివ్యాంగులకు ఆసరా పించన్లు మంజూరు చేసి ప్రతి నెలా అందిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులతో మహిళా స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామి పథకంలో 3,861 మంది దివ్యాంగులకు జాబ్ కార్డులు జారీ చేసి పనులు కల్పిస్తున్నామని తెలిపారు. వికలాంగులకు అవసరమైన పరికరాలను త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లాలో దివ్యాంగుల సమస్యలపై క్రమంగా సమీక్ష సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని జిల్లా కలెక్టర్ ద్వారా దివ్యాంగుల సమస్యలన్నీ పరిష్కరించుటకు కృషి చేస్తామని ఆమె అన్నారు.

అదనపు కలెక్టర్ (పరిపాలన) శ్యాం ప్రసాద్ లాల్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో పరిష్కారమయ్యే దివ్యాంగులు సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తామని అన్నారు. కొంతమంది దివ్యాంగుల కొత్త పెన్షన్ మంజూరుకు ప్రభుత్వానికి పంపామని త్వరలో మంజూరు అవుతాయని తెలిపారు. దివ్యాంగ మహిళలు స్వశక్తి సంఘాలలో చేరాలంటే సొంత ఇల్లు ఉండనవసరం లేదని, సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.  ప్రభుత్వం ద్వారా నిర్మిస్తున్న దుకాణాల సముదాయంలో అవకాశం ఉంటే దివ్యాంగులకు ప్రాధాన్యతతో కేటాయిస్తామని తెలిపారు. జిల్లాలో దివ్యాంగుల పోస్టులు రోస్టర్ ప్రకారం భర్తీ చేయబడుతాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల లో దివ్యాంగుల అభివృద్ది సంక్షేమానికి సంబంధించిన వివరాలతో కూడిన ఫ్లెక్సీలను  ఏర్పాటు చేస్తామని అన్నారు. కలెక్టరేట్ లో నిర్మించిన ర్యాంపు దివ్యాంగులకు ఉపయోగకరంగా లేదని తెలుపగా, త్వరలో కొత్తగా నిర్మించే కలెక్టరేట్ భవనంలో వికలాంగులకు అనుగుణంగా ర్యాంపులు నిర్మించుటకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ సుజయ్ మాట్లాడుతూ దివ్యాంగులకు అందరితో సమాన హక్కులు కల్పించాలని అన్నారు. పేదవారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నయా పైసా ఖర్చు లేకుండా న్యాయ సహాయం అందించబడు తుందని తెలిపారు.

అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చిన దివ్యాంగులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

 

Share This Post