అందివచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని అభివృద్ధిని సాధించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

నవంబర్ 06, 2021 – శనివారం కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి వివిద ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశం పొందిన యువతను అభినందించి శుభాకాంక్షలు తెలియచేసి ఉద్యోగ నియామక పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోగా జాబ్ మేళా నిర్వహణకు చక్కటి ఏర్పాట్లు చేశారని ఉపాధికల్పనాధికారిని, మున్సిపల్ సిబ్బందిని, పోలీస్, రెవిన్యూ అధికారులతో పాటు ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశం కల్పనకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులను అభినందించారు. చేస్తున్న ఉద్యోగంలో వేతనం ఎంత అన్నది చూడొద్దని, అనుభవం వస్తుందని ఆ అనుభవమే తద్వారా జీవితంలో మరింత నిలదొక్కుకోవడానికి అక్కటి పునాది అవుతుందని అందువల్ల యువత చిన్నా, పెద్దా అనే ఉద్యోగం అని చూడకుండా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయిన తరుణంలో ఆర్ధిక వ్యవస్థ బలపడినందున యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పనకు చేపట్టిన ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. తన విద్యాభ్యాసం పూర్తయిన తదుపరి పునే హానీవెల్ కంపెనీలో 10 వేల రూపాయలకు ఉద్యోగంలో చేరానని, ఆ ఉద్యోగ అనుభవం వెళకట్టలేనిదని, ఎన్నో అనుభవాలను, అనుభూతులను నేర్పిందని ఆనాటి తన ప్రధమ ఉద్యోగ జీవితాన్ని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని చాలెంజ్ తీసుకోవాలని అప్పుడే విజయాన్ని సాధించగలమని ఆయన సూచించారు. ఉద్యోగ రీత్యా కాస్త దూరం వెళ్లాల్సి వచ్చినా నిర్భయంగా వెళ్లాలని, ఇక్కడే ఉద్యోగం చేయాలనే ఆలోచనను విడనాడాలని కెరీయర్ ఇపుడే ప్రారంభం అవుతున్నందున సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు పేరుగాంచిన మల్టీలెవల్ కంపెనీలు ముందుకు వచ్చాయని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పనకు మినీ జాబ్ మేళాలు నిర్వహించు విధంగా కార్యాచరణ తయారు చేయాలని ఉపాధికల్పనాధికారికి సూచించారు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు సాధించిన యువత తమ ప్రాంత యువతకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. కొంతమంది యువత ఇంగ్లీషులో కాస్త వెనుకబడి ఉన్నా అటువంటి వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తే వారు చాకులా తయారవుతారని చెప్పారు. ఉపాధి కొరకు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, నిరుత్సాహ పరచకుండా ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని చెప్పారు. విద్యార్థులను పెద్ద సంఖ్యలో హజరయ్యే విధంగా చర్యలు తీసుకున్న డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్న కలెక్టర్ అభినందించారు. మీ దగ్గర చదువుకున్న విద్యార్థుల కెరీర్ ఏ విధంగా ఉందో వారికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటే వారి జీవితాలు మంచి స్థాయిలో ఉంటాయని ఆయన సూచించారు. ఎల్ అండ్ కంపెనీలో ఉద్యోగం సాధించిన సోమిశెట్టి భార్గవసాయికి మొదటి నియామక పత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా ఉపాధికల్పనాధికారి విజేత, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, ఎల్డీయం శ్రీనివాస్, తహసిల్దార్ రామక్రిష్ణ, కౌన్సిలర్ వేముల ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post