అక్టోబర్ 2వ తేదీ నుండి బతుకమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి బతుకమ్మ చీరెలు పంపిణీ, పోలింగ్ కేంద్రాలు వికేంద్రీకరణ, బృహాత్ పల్లె పకృతి వనాలు ఏర్పాటు, కరోనా వాక్సినేషన్ ప్రక్రియ, సీజనల్ వ్యాధులు నియంత్రణ, వర్షాలు, గోదావరి వరదలు, ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలపై రెవిన్యూ, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ చీరెలు పంపిణీకి ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు. చీరెలు తీసుకున్న లబ్ధిదారుల నుండి అక్విటెన్సు తీసుకోవాలని చెప్పారు. తహసిల్దార్లు  పోలింగ్ కేంద్రాలు పరిశీలన చేసి మార్పులు, చేర్చలకు అవకాశం ఉన్న కేంద్రాల వికేంద్రీకరణకు  ప్రతిపాదనలు అక్టోబర్ 3వ తేదీ వరకు పంపాలని ఆదేశించారు.  వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ప్రజలకున్న అపోహలను తొలగించి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. జిల్లాలో 8 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారున్నారని జాబితా తయారు చేయడం జరిగిందని, వారిలో ఇప్పటి వరకు 4 లక్షల మందికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 4 లక్షల మందికి వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కరోనా నియంత్రణకు 18 సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరు తప్పని సరిగా వాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మండలస్థాయిలో రెవిన్యూ, వైద్య, యంపిడిఓలు నిరంతర సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. శ్రీరాంసాగర్, ప్రాణహితలతో పాటు కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి పెద్దఎత్తున వరద చేరుతున్నదని అధికారులు, పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాగులు దాటకుండా పటిష్ట బారికేడింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మండలవారిగా నీట మునిగే ప్రాంతాల యొక్క జాబితాను సిద్ధం చేయాలని డిఆర్ఓ కు సూచించారు. వర్షాలువల్ల అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు, ఎడ్లబండ్ల యజమానులపై పోలీసు కేసులు నమోదు చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. వాహనాలు, ఎడ్లబండ్లు వాగుల వద్దకు వెళ్లకుండా ట్రెంచ్ ఏర్పాటుతో పాటు ఆయా రహదారుల్లో పటిష్ట పర్యవేక్షణ చేయాలని చెప్పారు. రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని పటిష్ట పర్యవేక్షణతో పాటు పెద్ద ఎత్తున జరిమాన, పోలీస్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. కిన్నెరసాని, తాలిపేరు మొదలైన ప్రాజెక్టుల నుండి నీటిని వదులున్న సమాచారాన్ని ప్రజలకు తెలియ చేయాలని చెప్పారు. ప్రాజెక్టుల నుండి ఆకస్మాత్తుగా నీటిని వదలడం ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, వైద్యాధికారులు డాక్టర్ శిరీష, వెంకేటశ్వరావు, అన్ని మండలాల తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post