అక్టోబర్, 25 నుండి నవంబర్ 3వ తేది వరకు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ లను సూచించారు

అక్టోబర్, 25 నుండి నవంబర్ 3వ తేది వరకు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ లను సూచించారు.  గురువారం ఉదయం ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తో కలిసి వీడియో కాన్ఫెరెన్సు ద్వారా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై విధివిధానాలు సమీక్షించారు.  కోవిడ్ తర్వాత తొలిసారి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రత్యక్షంగా నిర్వహించడం జరుగుతున్నందున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షకు ముందు ఆ తర్వాత శానిటైజేషన్ చేయాలని తెలిపారు. ఇందుకు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ బాధ్యతలు తీసుకొని విధిగా శానిటైజేషన్ చేయాలన్నారు.  ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా వేసుకునే  విధంగా చూడాలన్నారు. పరీక్ష ఉదయం 9 గంటల నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి విద్యార్థులు వివిధ ప్రదేశాల నుండి వస్తారు వారికి ప్రయాణ ఇబ్బందులు కలుగకుండా ఆర్.టి.సి బస్సులు రూట్ వారిగా సమయానికి నడిపించి విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  పరీక్ష రోజున పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  వైద్య శాఖ ద్వారా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ప్రథమ చికిత్స యూనిట్ పెట్టాలని, పిల్లలకు టెంపరేచర్ పరీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  108 అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 4941 విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షకు హాజరు కానున్నారని, మొత్తం 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు అమలు చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేసుకోవడం జరిగిందన్నారు. ఆర్.టి.సి వారితో, విద్యుత్ శాఖ, వైద్య, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ శాఖలతో సమన్వయం చేసుకొని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో డి.ఐ.ఈ.ఓ రియాజ్, జిల్లా వైద్య అధికారి రామెమనోహర్ రావు,  డిపిఓ మురళి తదితరులు పాల్గొన్నారు.

Share This Post