అక్రమ మద్యం నియంత్రణ కోసం ఎక్సైజ్‌ స్టేషన్ల ఏర్పాటు : రాష్ట్ర మంత్రి వర్యులు డా. వి. శ్రీనివాస్‌గౌడ్‌

జిల్లాలో అక్రమ మద్యం నియంత్రణ, నిషేధిత గుడుంబా, నాటుసారా తయారీపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, వీటి కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు సమగ్ర న్యాయం దిశగా ఎక్సైజ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రొహిబిషన్‌ & ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు, పర్యాటక శాఖ మాత్యులు డా. వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం లక్షైట్టిపేట మండల కేంద్రంలో 30 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎక్సైజ్‌ స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్ళవాగు వద్ద 40 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎక్సైజ్‌ స్టేషన్‌ను పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌ నేత, జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, శాసనమండలి సభ్యులు పురాణం సతీష్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, జిల్లాలో అక్రమ మద్యంతో పాటు నిషేధిత గుడుంబా, నాటుసారా తయారీపై ప్రత్యేక దృష్టి సారించి నియంత్రించేందుకు ఎక్సైజ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, నిషేధిత మద్యం కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు సమగ్ర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మద్యం షాపుల టెండర్లలో గీతా కార్మిక, దళిత, గిరిజనులకు రిజర్వేషన్‌ కల్పించడం జరిగిందని, కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. అన్ని రకాల కుల వృత్తుల వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ ఆర్థికంగా ప్రోత్సహించడం జరిగిందని, గీతా కార్మికులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించడంతో పాటు వారి బాగోగులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. గీతా కార్మికులలో మరణించిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించడం జరుగుతుందని, అన్ని శాఖల వారికి జీతాలు పెంచడంతో పాటు పదోన్నతులు కల్పించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ద్తీ కోట్ల 15 లక్షల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. టెండరు విధానం ద్వారా వైన్‌షాపులను అనుమతులు ఇవ్వడం జరిగిందని, గీతా కార్మికులతో పాటు మిగతా కులాల వారికి అవకాశం కల్పించడం జరిగిందని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అనుమతుల జారీపై పరిశీలించి 24 గంటలలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంతో పాటు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమాలలో జిల్లా ఆబ్బారీ శాఖ సూపరింటెండెంట్‌ నరేందర్‌, మంచిర్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెంట రాజయ్య, లక్షైటపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నల్మాసు కాంతయ్య, కౌన్సిలర్లు, గౌడ సంఘం నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post