అటవీ సంరక్షణ, పునర్జీవనానికి పొలిసు, రెవిన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. మానవాళి మనుగడకు, పర్యావరణ సమతుల్యాన్ని అడవుల పెంపకం ఎంతో అవసరమని, భూభాగంలో 33 శాతం అడవులు విస్తరించి ఉండాలని, కానీ నేడు 24 శాతం మాత్రమే ఉందని ఇంకా 9 శాతం అడవులను అభివృద్ధి చేయవలసిన అవసరముందని అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా స్థాయి అటవీ రక్షణ, అటవీ పునర్జీవం పై పొలిసు, రెవిన్యూ, అటవీ శాఖ,విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అటవీ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఏడు విడతలుగా హరిత హారం కార్యక్రమం చేపట్టడం ద్వారా గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అడవులు విస్తరిస్తున్నాయని కేంద్రమే ప్రశంసించిందని అన్నారు.మన జిల్లాలో 57,623 హెక్టార్ల అటవీ విస్తరించి ఉన్నదని, ఇట్టి అడవులను సంరక్షించుటకు ట్రెంచ్ లు ఏర్పాటు చేయడం తో పాటు నీటి సంరక్షణకు, నేల కోతకు గురికాకుండా చెక్ డ్యాంలు, రాక్ ఫిల్ డ్యామ్ లు, భూసార సంరక్షణ పనులు వంటివి జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద పలు అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. అడవులలో అనవసరమైన కలుపు వంటివి తొలగించి అటవీ సంపద పెంపునకు , ప్రకృతి వనరులను కాపాడుటకు కృషి చేస్తున్నామని, అదేవిధంగా ఔషధ, పండ్లు, బొంగులు వంటివి బ్లాక్ ప్లాంటేషన్ చేస్తున్నామని అన్నారు. వన్యప్రాణులను కాపాడుటకు నేరేడు, ఉసిరి వంటి పండ్ల మొక్కలు నాటాలని, మంచినీటిని ఏర్పాటు చేయాలని అన్నారు. కాగా అక్కడక్కడా అడవులు అన్యాక్రాంతమవుచున్నాయని, వాటిని కాపాడడం తో పాటు అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాలని అన్నారు. అటవీ సంపదను నరకకుండా రైడ్స్ నిర్వహించాలని, రాత్రి పూట గస్తీ తిరగాలని సూచించారు. నరసాపూర్ లో అర్బన్ పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయుటకు 5 ఎకరాల స్థలం వివాదంలో ఉందని రెండు, మూడు రోజులలో సంబంధితులతో మాట్లాడి పరిష్కరించాలని పొలిసు, అటవీ శాఖా రేంజి అధికారులకు సూచించారు. అదేవిధంగా మేడంపూర్ లో 45 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని వాటిని సంరక్షించవలసినదిగా అధికారులకు సూచించారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటె అటవీ శాఖ పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న ఫారెస్ట్ బ్లాక్ లలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. అటవీ శాఖకు సంబంచించి నర్సరీలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేలా పై అధికారులతో సంప్రదించవలసినదిగా విద్యుత్ శాఖ డిఇ కి సూచించారు.
చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్ మాట్లాడుతూ అడవుల సంరక్షణకు అందరి సహాకారం అవసరమని అన్నారు. అటవీ అభివృద్ధికి శాఖ పరంగా వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, అడవులు అన్యాక్రాంతం కాకుండా, చెట్లు కొట్టి వేయకుండా నిఘా పెట్టాలని కోరారు.
ఈ సమావేశంలో డి.ఎఫ్.ఓ. జ్ఞానేశ్వర్, విద్యుత్ శాఖ డి.ఈ మల్లేశం, ఆర్.డి.ఓ.లు సాయి రామ్, శ్యామ్ ప్రకాష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. గంగయ్య, జిల్లా పరిశ్రమల కేంద్రమా జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సి.ఐ. లు, ఎస్.ఐ.లు తదితరులు పాల్గొన్నారు.