పత్రికా ప్రకటన
11 19 2021
వనపర్తి
అటవీ వనాలను సంరక్షించడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని వనపర్తి జిల్లా అటవీశాఖ అధికారి రామకృష్ణ అన్నారు.
శనివారం అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అసువులు బాసిన అటవీ అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. జిల్లా కేంద్రంలోని ఏకోపార్కు లో జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ
సమాజానికి, ప్రకృతికి మేలు చేకూర్చే అటవీ సంపదను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారన్నారు. ముఖ్యంగా అటవీ సంపదను కాపాడటంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారని తెలిపారు.. అటవీ సంపదను దోచుకునే దొంగలు, మాఫియా ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృధాపోవన్నారు. వారి త్యాగలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు.
కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం తలెత్తిన తొలి రోజుల్లో సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొనాలో తెలియక ప్రపంచం యావత్తూ విస్మయం చెందిందని పేర్కొన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అటవీ సంపద ను కాపాడడంలో సిబ్బంది తమ విధులను అణుమాత్రం కూడా విస్మరించలేదన్నారు.
ప్రకృతి పరంగా లభించిన సహజ వనరులను కాపాడుకోవడంతో అభివృద్ది పరచడం మనందరి బాధ్యత. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడడం కోసం విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ సిబ్బంది యొక్క అంకితం భావం చిరస్మరణీయం, స్పూర్తిదాయకం అన్నారు. 1730 సెప్టెంబర్ 11న రాజస్థాన్లో అటవీ సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ కొరకు 363 మంది అసువులు బాశారు వారి సంస్మరణార్థం అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్ నాజియా తబస్సుమ్, రేంజ్ ఆఫీసర్ వాణి కుమారి, వనపర్తి, ఘనపూర్, గద్వాల్ రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి చే జారీ చేయడమైనది.