అటవీ బ్లాకు ప్రాతిపదికన పునరుద్ధరణ జిల్లా వ్యాప్తంగా జరగాలి :జిల్లా కలెక్టర్ శ్రీ పి. వెంకట్రామ రెడ్డి

జిల్లాలోని అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకులు నూరుశాతం పునరుద్ధరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీ పి. వెంకట్రామ రెడ్డి చెప్పారు.

సోమవారం సిద్ధిపేట ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో అటవీ ప్రాంత నియంత్ర కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ ఛైర్మన్ అధ్యక్షతన జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ తో కలిసి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
ప్రతీ బ్లాకుకు ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా జిల్లాలోని 61 బ్లాకులకు గానూ 61 మంది జిల్లా అధికారులను నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫారెస్ట్ రిజునవేషన్ లో అటవీ అభివృద్ధిని సాధిద్దామని అధికారులకు సూచించారు.

ప్రతీ అటవీ బ్లాకు ప్రాతిపదికగా అటవీ పునరుద్ధరణ కార్యాచరణ ప్రణాళిక (ఫారెస్ట్ రీజునవేషన్ యాక్షన్ ప్లాన్) జరగాలనేది సీఎం ఆకాంక్ష అని, ఆ మేరకు అటవీ శాఖ పనులను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కంపా నిధుల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, కంపా నిధుల వినియోగం, చేపట్టిన పనులు, ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 61 బ్లాకులు ఉన్నాయని, అడవుల చుట్టూ బోర్డర్ కందకం వేసేందుకు ప్రణాళికలు వేసి దట్టమైన బౌండరీ నిర్మిద్దామని తలపెట్టినట్లు డీఎఫ్ఓ శ్రీధర్ తెలిపారు. అవసరం ఉన్నచోట మొక్కలు పెడదామని, గ్యాప్, బండ్ ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా అడవుల అభివృద్ధి, సంరక్షణకు కృషి చేస్తున్నట్లు డీఎఫ్ఓ వివరించారు.

– జిల్లాలో ఆజాద్ కా అమృత్ మ‌హోత్స‌వ్‌

జిల్లాలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో జిల్లా అధికారిక, సిబ్బంది సమన్వయంతో తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. వెంకట్రామ రెడ్డి కోరారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భార‌త్ 75వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న నేప‌థ్యంలో ఆజాద్ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను నిర్వహిస్తున్నట్లు, ఇందుకు గానూ జిల్లాలో 79 గ్రామాలు, 79 యూత్ సంస్థలు ఎంపికైనట్లు జిల్లా యువజన అధికారి బిన్సీ వివరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post