అటవీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి కృషి చేస్తుంది- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అటవీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాల్ లో అడవుల సంరక్షణ పై అఖిలపక్ష సమావేశం విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు. సమన్వయంతో రైతుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని తెలిపారు.

జిల్లాలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా అటవీ భూముల సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు పునరుజ్జీవనానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అటవీ భూముల గుర్తింపు చట్టం అమల్లో భాగంగా గ్రామ మండల జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధులకు నెల రోజుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని అటవీ భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని మంత్రి కోరారు. అటవీ భూముల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రారంభమైందని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఫలితాలు సాధిస్తామని మంత్రి కోరారు. అటవీ భూముల సమస్యల పరిష్కారం కోసం అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం పూర్తిగా పరిష్కరించిన తర్వాతే ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈనెల 8వ తేదీ నుండి అటవీ భూములకు సంబంధించిన హక్కుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని ఇందుకోసం నియోజకవర్గాల వారీగా డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. అవసరమైన చోట్ల రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సమన్వయంతో సర్వే నిర్వహిస్తారని అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్డు ఉన్నచోట అటవీశాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని మంత్రి ఆదేశించారు. నూతనంగా విస్తరించే క్రమంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతాలను విస్తరించాలని హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలను నాటిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని, అటవీ సంపద భవిష్యత్తు తరాలకు అందించటానికి మనందరం కలిసి కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా విస్తీర్ణం 1243160.10 ఎకరాల వైశాల్యం కలిగి ఉందని, అందులో 73007.91 ఎకరాల అటవీ వైశాల్యం కలిగి ఉందని, 84 అటవీ బ్లాకులు కలిగి ఉన్నాయని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాద్ రెడ్డి, శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, కాలే యాదయ్య, అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా అటవీ శాఖాధికారి జానకి రామ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహింపట్నం ఆర్డిఓ వెంకటాచారి, షాద్ నగర్ ఆర్ డి ఓ రాజేశ్వరి, చేవెళ్ల ఆర్ డి ఓ వేణుమాధవ్, టిఆర్ఎస్, బిజెపి, సిపిఎం, సిపిఐ(ఎం) పార్టీ ప్రతినిధులు, అటవీ రెంజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post