అటవీ శాఖపై సచివాలయంలో సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

*అడవుల రక్షణ, పునరుద్దరణకు మొదటి ప్రాధాన్యత*

 

*ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, రికార్డు స్థాయిలో కొత్త ఫారెస్ట్ బ్లాక్ ల నోటిఫికేషన్*

 

*బీడీ కార్మికులకు సేకరణ ఛార్జీలు, బోనస్ అన్ లైన్ ద్వారా నేరుగా ఖాతాలకు చెల్లింపు*

 

*కోతుల బెడద నివారణకు స్టెరిలేజేషన్ సెంటర్లు పెంచేందుకు ప్రణాళికలు*

 

——అటవీ శాఖపై సచివాలయంలో సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి———

 

అటవీశాఖ పనితీరు, పురోగతిపై సచివాలయంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాలు, లక్ష్యాలు, పనుల్లో పురోగతిపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం పర్యావరణ రక్షణకు, అడవుల పునరుద్దరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, శాఖా పరంగా అన్ని రంగాల్లో జాతీయ స్థాయి గుర్తింపు రావటం సంతోషకరమని మంత్రి అన్నారు. బీడీ కార్మికులకు సేకరణ ఛార్జీలు, బోనస్ అన్ లైన్ ద్వారా నేరుగా ఖాతాలకు చెల్లింపు ప్రక్రియను అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. సుమారు లక్ష మంది లబ్దిదారులకు 220 కోట్ల రూపాయల బోనస్ ను చెల్లించటం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

 

హరితహారాన్ని విజయవంతం చేసి, గణనీయంగా పచ్చదన శాతం పెరిగేందుకు కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, భాగస్వామ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రభుత్వ అభివృద్ది పనులకు అటవీ భూములను వినియోగించుకున్నప్పుడు, ప్రత్యామ్నాయ భూముల్లో కంపా నిధుల ద్వారా అడవులను అభివృద్ది చేస్తున్న రాష్ట్రాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నామని అన్నారు. ఈ రకంగా 135 కొత్త అటవీ బ్లాక్ లను అభివృద్ది చేస్తూ, సుమారు 14 వేల ఎకరాల అడవిని సృష్టించటంతో పాటు, ఆ అటవీ బ్లాక్ లను ప్రభుత్వం ద్వారా నోటిఫై కూడా చేయటం ఒక రికార్డు అని మంత్రి అన్నారు.

 

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కోతుల బెడద అధికంగా ఉందని, రైతులు కూడా ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వస్తోందని అన్నారు. నిర్మల్ లో నెలకొల్పిన స్టెరిలైజేషన్ సెంటర్ తరహాలో దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని మంత్రి సూచించారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపాలని పీసీసీఎఫ్ ను కోరారు.

 

కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి గ్రామాల తరలింపు పురోగతి, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో టైగర్ కారిడార్ల విసృతిపై చర్చించారు. అటవీ నేరాల అదుపులో కఠినంగా ఉండాలని, అవసరం అయితే పోలీసు శాఖతో సమస్వయం చేసుకుని పీ.డీ కేసులు పెట్టాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న విజిలెన్స్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. అటవీశాఖలో ఖాళీల భర్తీని టీఎస్ పీఎస్ తో సంప్రదింపుల ద్వారా త్వరగా రిక్రూట్ మెంట్ జరిగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీలున్న అన్ని ప్రాంతాల్లో బాధ్యతాయుతమైన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని మంత్రి అన్నారు.

 

శాఖా పరంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని, పదేళ్ల ప్రగతిని అన్ని వర్గాలకు వివరించాలని, జూన్ 19 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ హరితోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

 

సమీక్షా సమావేశంలో పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, అటవీ అభివృద్ది సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర రెడ్డి, అటవీశాఖ జాయింట్ సెక్రటరీ ఎం. ప్రశాంతి, పీసీసీఎఫ్ లు లోకేశ్ జైస్వాల్, ఎలూసింగ్ మేరు, ఎం.సీ పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నాగేశ్వర రావు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post