అటవీ సంపదను కాపాడండి, గుడుంబా, గంజాయి వినియోగాన్ని అరికట్టాలి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

అటవీ సంపదను కాపాడేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో అటవీ సంరక్షణ, గంజాయి, గుడుంబా వినియోగం వంటి అంశాలపై ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అడవులను సంరక్షించాలని, సంబంధిత శాఖల సహకారంతో అటవీ క్షేత్రాలను, సంపదను కాపాడాలని అన్నారు. జిల్లాలో గంజాయి, గుడుంబా వినియోగం పై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని అన్నారు. గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలలోని వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. ఈ సందర్బంగా ఎక్సయిజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి, గుడుంబా ను సంపూర్ణంగా నిర్ములించేందుకు శాఖ పరంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకొని గంజాయి మొక్కలను ధ్వంసం చేయడం జరుగుతున్నదని తెలిపారు. పత్తి, పసుపు, తదితర పంటల మధ్యలో గంజాయి సాగు జరుగుతున్నదని తెలిపారు. అటవీ ప్రాంతాలలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం ఉందని, వారికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రలోభాలకు లొంగి గంజాయి సాగు చేయవద్దని రైతులకు తెలియజేయడం జరుగుతున్నదని అన్నారు. గిరిజన ప్రాంతాలలో ఇప్ప పువ్వు సారా ను వినియోగిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుండి జైనథ్, బేల మండలాల్లోని గ్రామాలలో దేశీదార్ వినియోగిస్తున్నారని, వాటిని కూడా వినియోగించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీస్, అటవీ, ఎక్సయిజ్ శాఖల ద్వారా సంయుక్తంగా చర్యలు చేపట్టడం ద్వారా ఆశించిన ప్రగతి సాధించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, ఉట్నూర్ అటవీ అభివృద్ధి అధికారి రాహుల్ జాదవ్, ఆర్డీఓ రాజేశ్వర్ పాల్గొన్నారు.

Share This Post