DPRO ADB -అటవీ సంపదను కాపాడుకుందాం- పోడు భూముల సమస్యలను పరిష్కరించుకుందాం- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

పోడు భూముల సమస్య అనంతరం ఒక్క అంగుళం కూడా అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అటవీ సంరక్షణ, అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పోడు భూముల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల 47 వేల 559 ఎకరాల విస్తీర్ణంలో అటవీ సంతరించుకొని ఉందని తెలిపారు. జిల్లాలో 17 వేల 657 మందికి 69 వేల 654 ఎకరాల అటవీ హక్కు పత్రాలను అందజేయడం జరిగిందని అన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులతో కూడిన కమిటీ వేయడం జరిగిందని, పలు దఫాలలో పోడు భూముల సమస్యలపై కమిటీ చర్చించిందని తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు కమిటీ అధ్యయనం చేసి నిర్ణయాన్ని తెలియజేయడం జరిగిందని, జిల్లా వారీగా అన్ని పార్టీల ప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు సూచనలు ఈ నెల 30 నాటికి తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. నవంబర్ 8 నుండి డిశంబర్ 8 వరకు పోడు భూముల సమస్యలపై గ్రామస్థాయిలో అర్జీలను స్వీకరించి వాటిని డివిజనల్ స్థాయి అధికారుల కమిటీకి అందజేయడం జరుగుతుందని, వాటిని పరిశీలించి జిల్లా స్థాయి కమిటీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. డిశంబర్ 2005 కు ముందు అటవీ భూములు సాగు చేస్తున్న వారికీ యాజమాన్య హక్కు పత్రాలను అందించడంతో పాటు మూడు తరాల నుండి సాగు చేస్తున్న ఎవరికైనను పట్టాలు ఇచ్చే విధంగా చట్టం లో ఉందని తెలిపారు. హక్కు పత్రాలు కలిగిన వారు మరణిస్తే వారి వారసులకు వారసత్వ హక్కు పత్రాలను ITDA ప్రాజెక్టు అధికారి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం అయిన తరువాత ఏ ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా రెవెన్యూ, ITDA, అటవీ శాఖ అధికారులతో పాటు ప్రజాప్రతిధులు సహకరించాలని అన్నారు. భావితరాల వారికీ అటవీ సంపదను అందించాల్సిన బాధ్యత మనపై ఉందని, అడవులు అన్యాక్రాంతం అయినట్లయితే కరోనా లాంటి ఉపద్రవాలు సంభవించే ప్రమాదం ఉందని అన్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు తెలిపిన సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని సూచనప్రాయంగా తెలిపారు. అతి తొందరలో ప్రభుత్వం పోడు భూముల సమస్యపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, అర్హత కలిగిన వారికీ హక్కు పత్రాలను అందించాలని, పెండింగ్ లోని దరఖాస్తులను పరిశీలించాలని కోరారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, అటవీ సంరక్షణతో పాటు అర్హత కలిగిన వారికీ ROFR పత్రాలను అందించడం జరుగుతుందని తెలిపారు. పోడు వ్యవసాయం పై వివిధ వర్గాల వారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని తెలిపారు. ITDA, రెవెన్యు, అటవీ శాఖల సహకారంతో పోడు భూములకు పత్రాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జారీ చేయడం జరుగుతుందని అన్నారు. ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, ROFR పట్టాలు పారదర్శకంగా సాగు చేస్తున్న వారికీ అందించాలని అన్నారు. అటవీ భూములు ఇకముందు ఆక్రమణకు గురికాకుండా ప్రతిజ్ఞ చేయాలనీ అన్నారు. బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ, తరతరాల భూముల సమస్యలకు పులిస్టాప్ పెట్టాలని, బోథ్ నియోజకవర్గం లో కొన్ని దరఖాస్తులు రిజక్ట్ చేయడం జరిగిందని వాటికీ కారణాలు తెలిపాలని కోరారు. ఖానాపూర్ శాసన సభ్యురాలు రేఖ నాయక్ మాట్లాడుతూ, గొట్టి గ్రామంలో PP భూములను అటవీ భూములుగా చూపిస్తూ సాగు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారని అన్నారు. అటవీ సంరక్షణ అధికారి రామలింగం మాట్లాడుతూ, పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న కాలంలో పోడు భూముల సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అడవులను సంరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఆదిలాబాద్ అడవుల జిల్లాగా పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, అడవుల పరిరక్షణ, పోడు భూముల సమస్యలు శాశ్వత పరిష్కారాలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్ మాట్లాడుతూ, గ్రామస్థాయి లో స్వీకరించిన దరఖాస్తులను డివిజినల్ స్థాయి కమిటీకి, డివిజినల్ కమిటీ పరిశీలన అనంతరం జిల్లా స్థాయి కమిటీకి సిఫారసు చేస్తుందని తెలిపారు. ROFR చట్టం పారదర్శకంగా ఉందని తెలిపారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు వారిపరిధిలోని సమస్యలను, సలహాలను సమావేశంలో వివరించారు. అనంతరం అడవుల సంరక్షణ కు కట్టుబడి ఉంటామని, ఇకముందు అటవీ ఆక్రమణకు గురికాకుండా సహకరిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు, ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపీపీలు, జడ్పీటీసీ లు, వివిధ పార్టీల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post