పత్రికా ప్రకటన తేది05.11.2021 వనపర్తి
అటవీ సంపద పెంచుకుంటేనే భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు. అడవుల ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం హరితహారం కింద మొక్కలు నాటి పచ్చదనం పెంపు దోహదపడుతుందని తెలిపారు..
అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం పై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ శుక్రవారం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడారు. జిల్లాలో 36 గ్రామ పంచాయతీల్లో పోడు వ్యవసాయం కింద ఆక్రమణ జరిగిందని తెలిపారు. అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం గత నెల 31న ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ స్థాయి కమిటీలు పోడు భూములు సాగు చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, మండల ,డివిజన్ కమిటీలకు కు వాటిని అందజేయాలని సూచించామన్నారు. డివిజన్ కమిటీ వాటిని పరిశీలించి జిల్లా కమిటీకి పంపే విధంగా తెలియజేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా హద్దులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ జిల్లా అటవీశాఖ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.