అటవీ హక్కుల గుర్తింపుకు సంబంధించి సర్వేకు సిద్ధంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 5: జిల్లాలో అటవీ హక్కుల గుర్తింపుకు సంబంధించి సర్వే చేయడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ, అటవీ, పంచాయితీ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ హక్కుల గుర్తింపు కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి, వచ్చే సోమవారం నుండి అటవీ హక్కుల గుర్తింపు కోసం క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయాలని అన్నారు. జిల్లాలో 27 మంది ఫారెస్ట్ బీట్ అధికారులు ఉన్నారని, అటవీ హక్కుల గుర్తింపు సర్వేలో వారి పాత్ర కీలకమని అన్నారు. కమిటీలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. హక్కు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్వంత నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే జిల్లా ఉన్నతాధికారులను దృష్టికి తేవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు గంగయ్య, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post