అటవీ హక్కు చట్టం ప్రకారం ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌. పట్టాల పంపిణీ : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్‌.ఓ. ఎఫ్‌. ఆర్‌. -2005 చట్టం ప్రకారం పోడు భూములలో వ్యవసాయ సాగుపై ఆధారపడి జీవిస్తున్న పోడు రైతులకు గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పటేల్‌ గార్డెన్స్‌లో జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, తహశిల్దార్లు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, అటవీ హక్కుల కమిటీ బృందాల సభ్యులకు పోడు భూములు, రైతుల వివరాల సేకరణ, నమోదుపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 106 హాబిటేషన్స్‌లలో 10 / 15 మంది సభ్యులతో అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, పోడు భూములలో సాగుపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఆర్‌.ఓ. ఎఫ్‌.ఆర్‌. చట్టం ప్రకారం న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జీవరాశి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంతో అవసరమని, ఈ మేరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం గొప్ప కార్యక్రమమని, కాలుష్య వాతావరణాన్ని నియంత్రిస్తూ అడవుల శాతం పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు ఒక అంగుళం అటవీ భూమి కూడా అక్రమణకు గురి కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అటవీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని మండలాలు, గ్రామాలు, వాబిటేషన్లలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో సభలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో అడవిని కాపాదేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, జిల్లాలో 311 గ్రామపంచాయతీలలో 80 గ్రామపంచాయతీలలో పోడు వ్యవసాయం సాగు చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, 106 వాబిటేషన్స్‌ ఉన్నాయని తెలిపారు. ఆర్‌.ఓ. ఎఫ్‌.ఆర్‌.-2005 చట్టం ప్రకారం తేది : 13-12-2005కు ముందు నుండి భూములు సాగు చేస్తున్న షెడ్యూల్డ్‌ తెగల వారు అర్హులని, ఇతరులకు 75 సంవత్సరాల పాటు 3 తరాలుగా సాగు చేసుకుంటున్న వారికి ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఇట్టి పోడు భూముల సాగులో ఉండి అర్హత గల వారికి పట్టాలు అందజేయడం జరుగుతుందని, దళారుల ప్రలోభాలకు ఎవరు లోను కావద్దని గ్రామసభల ఏర్పాటు సమయంలో 50 శాతం కంటే ఎక్కువగా మెజార్టీ ఉండాలని, ఫారెస్ట్‌ రైట్‌ కమిటీ పరిధిలో నిర్వహించు గ్రామసభల్లో నిబంధనల ప్రకారం సభ్యులు ఉండాలని, మహిళలు, ఎస్‌.టి. వారు లేని చోట చట్టం మేరకు ప్రత్యామ్నాయం తీసుకోవాలని తెలిపారు. అటవీ అభివృద్ధికి గ్రామపంచాయతీ, పురపాలక చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post