అడవి భూములను నమ్ముకొని జీవిస్తున్న పేద రైతులకు న్యాయం చేకూర్చి భూమి పై హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి గ్రామ కమిటీల ద్వారా రైతులకు సరియైన అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

అడవి భూములను నమ్ముకొని జీవిస్తున్న పేద రైతులకు న్యాయం చేకూర్చి భూమి పై హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి గ్రామ కమిటీల ద్వారా రైతులకు సరియైన అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. ఈ నెల 8 వ తేదీ నుండి పోడు భూమి సాగు చేస్తున్న రైతులు తమ భూమి పై హక్కులు పొందేందుకు ఏ విధానంగా దరఖాస్తులు చేసుకోవాలి, ఎలాంటి ఆధారాలు జత చేయాలి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనే అంశాలపై గ్రామ కమిటీలకు అవగాహన కల్పించేందుకు శనివారం కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ తాము పోడు భూమి పై ఆధారపడి జీవిస్తున్నాము అని అనుకునే ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తు తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం గిరిజనులు అయితే 25 సంవత్సరాల నుండి సాగు చేస్తూ ఉండాలని, గిరిజనేతరులు అయితే 75 సంవత్సరాల నుండి సాగుచేస్తున్న వారు అర్హులుగా ఉంటారన్నారు. అదే సమయంలో అడవి భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉన్నందున ఇక పై ఏ ఒకరు ఒక్క అంగుళం అడవి భూమిని ఆక్రమించడానికి వీలు లేదని ఈ విషయాన్ని సైతం గ్రామ కమిటీల ద్వారా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలియజేసారు. గ్రామ కమిటీలకు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ఫారం-ఏ పాత్రలను అందజేయడం జరుగుతుందని వాటిని లబ్ధిదారులకు అందించి అవగాహన కల్పించి రెండు మూడు రోజుల తర్వాత లబ్ధిదారుల నుండి పూరించిన దరఖాస్తులను తిరిగి స్వీకరించవలసిందిగా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టా గౌడ్, ఫారెస్ట్ డివిజన్ అధికారి నవీన్, కొల్లాపూర్ ఆర్డీఓ హనుమ నాయక్, తహశీల్దార్లు ఎంపీపీ భోజ్యా నాయక్ సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు, వి.ఆర్.ఓ లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు

Share This Post