అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 3: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులకు అటవీ హక్కుల గుర్తింపుపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ హక్కుల చట్టం అమలులో అధికారుల పాత్రపై అవగాహనకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, ఇట్టి శిక్షణా కార్యక్రమాలను మండల స్థాయిలో ఏర్పాటుచేసి మండల, గ్రామస్థాయి అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. 2005, డిశంబర్ 13 కు ముందు అటవీ భూములను సాగు చేస్తూ, వాటినే జీవనాధారం చేసుకున్న గిరిజనులు, 75 సంవత్సరాలుగా అటవీ భూములను సాగుచేస్తూ, వాటినే జీవనాధారంగా చేసుకున్న గిరిజనేతరులకు వారి ఆధీనంలో ఉన్న భూములపై హక్కులకల్పనతోటు, మిగతా ఆటవీప్రాంతాన్ని సంరక్షించడం ఈ చట్ట ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించడం, అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయడం చేయాలన్నారు. గ్రామసభలో కనీసం 50 శాతం గ్రామ ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామసభ ద్వారా గ్రామ స్థాయి అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు, అటవీ భూముల సర్వే తదితర అన్ని ప్రక్రియల్లో అటవీ హక్కుల చట్టం-2005 లోని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. కమిటీలో 10 నుండి 15 మంది సభ్యులను ఎన్నుకోవాలని, ఇందులో 2/3 వంతు గిరిజనులు, 1/3 వంతు మహిళలు తప్పక ఉండాలని ఆయన సూచించారు. ప్రతి దరఖాస్తు గ్రామసభ తీర్మాణం తోనే ఆమోదం కానీ, తిరస్కరణ గాని చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో 67 గ్రామాల నుండి దరఖాస్తులు వస్తాయన్నారు. దరఖాస్తుపై తీసుకున్న చర్యలను దరఖాస్తుదారునికి అందజేసి, రశీదు పొందాలన్నారు. దరఖాస్తు ఫారం పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలన్నారు. పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు, బట్వాడా, మినిట్స్ రిజిస్టర్లు, అటవీ హక్కుల కమిటీ దరఖాస్తు, మినిట్స్ రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సరైన దృక్పథంతో చట్టాన్ని ఖచ్చితంగా అనుసరిస్తూ, ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆక్రమణలో ఉన్న భూమిని మినహాయించి, క్రొత్తగా ఒక్క గజం అటవీ భూమికి భంగం వాటిళ్లకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, చట్టంలోని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఏ దశలోనూ పొరపాటుకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సందేహాలను సీనియర్ అధికారులతో నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారిణి బాలామణి, ఇంఛార్జి రెవెన్యూ అధికారి టి.శ్రీనివాస రావు, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీటీడీఓ గంగారాం, డీఆర్డీఓ కె.కౌటిల్య, డీపీఓ రవీందర్, డీసీఓ బుద్దనాయుడు, ఆర్టీఓ కొండల్ రావు, ఏడీ సర్వే&ల్యాండ్ రికార్డ్స్, ఎంపీడీఓ లు, తహశీల్దార్లు, ఎంపీఓలు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, గ్రామ పంచాయితీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post