@ అడ్డాకుల మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
@ తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
@ ధరణి నిర్వహణ, కంటి వెలుగు పై ఆరా
@ ప్రభుత్వ కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులకు సూచనలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్
మండల స్థాయిలో ఆయా ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు మెరుగైన విధంగా సేవలందించాలని జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్ అన్నారు.
గురువారం అయన అడ్డాకుల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ,ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతేకాక పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని కూడా పరిశీలించారు.
ముందుగా అడ్డాకుల తహసిల్దార్ కార్యాలయంలో ధరణి ప్రక్రియను సంబంధిత విభాగానికి వెళ్లి కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో పరిశీలిస్తూ ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని? ఎన్ని పెండింగ్ ఉన్నాయని? తహసిల్దార్ కిషన్ తో అడిగి తెలుసుకున్నారు. కాగా 46 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తహసిల్దార్ తెలుపగా,అందుకు గల కారణాలను కలెక్టర్ అడిగారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం లబ్ధిదారులు రానందున పెండింగ్లో ఉన్నాయని తహసిల్దార్ కిషన్ జిల్లా కలెక్టర్ కు బదులిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తహసిల్దార్ కార్యాలయంలోని అన్ని గదులను తిరిగి పరిశీలించారు. కార్యాలయంలోనే ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ తో జిల్లా కలెక్టర్ తో శాంతిభద్రతలపై, అదేవిధంగా జాతీయ రహదారి అడ్డాకుల మండల కేంద్రంపై మీదుగా వెళుతున్నందున రోడ్డు ప్రమాదాలు, తదితర అంశాలపై వాకాబు చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి డాక్టర్ అపర్ణతో మాట్లాడుతూ, ల్యాబ్ టెస్టింగ్, కంటి వెలుగు శిబిరాల నిర్వహణ, మందుల అందుబాటు,తదితర అంశాలను గురించి అడిగారు.
ఆ తర్వాత ఎంపీడీవో కార్యాలయంలోని అన్ని గదులను పరిశీలించిన అనంతరం ఎంపీడీవో మంజులతో కార్యాలయ నిర్వహణ ,ఫైళ్ల నిర్వహణ గురించి అడిగారు.
పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి వేసవి దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని, పల్లె ప్రకృతి వనంలోని చెట్లన్నీటికి క్రమం తప్పకుండా నీరు పెట్టాలని చెప్పారు .