బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేయుచున్న వైద్యాధికారులు, వైద్యులు, స్పెషలిస్టు వైద్యులు, కార్యాలయ సిబ్బందితో వైద్యసేవలు నిర్వహణ, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పన, పాల్వంచలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో అనుభవజ్ఞులైన మీరు సమయ పాలన పాటించి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పారు. నిరుపేదలు, నిరక్ష్యరాస్యులు అధికంగా ఉన్న మన జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులే పేద ప్రజల దేవాలయాలని ఆలోచన చేయాలని చెప్పారు. సకాలంలో వైద్య సేవలు అందించకపోతే వాటిల్లే ప్రమాదం ఎంత బయంకరంగా ఉంటుందని, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. వైద్య సిబ్బంది ఉన్న తరువాత కూడా ఎందుకు మరణాలను నియంత్రించలేకపోతున్నామని వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కోలుకోలేని ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిచుకోవచ్చుననే భావనను విడనాడాలని, అటువంటి వారికి ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహణకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీకిచ్చిన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటే చాలని ప్రత్యేకంగా సమయభావం వెచ్చించాల్సిన అవసరం లేదని చెప్పారు. అత్యవసర చికిత్సలు నిర్వహణకు ప్రత్యేక వైద్యులు అందుబాటులో లేకపోవడం అనే సమస్య ఉత్పన్నం కావొద్దని చెప్పారు. సిబ్బంది సమయపాలన పాటించు విధంగా అన్ని వైద్య విధాన ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని చెప్పారు. సమయపాలన చాలా ముఖ్యమని చెప్పారు. రామవరంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రధాన రహదారి నుండి ఆసుపత్రి వరకు సిసి రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. పనులు నిర్వహణపై తనకు రోజు వారి ప్రగతి నివేదికలు అందచేయాలని ఆసుపత్రుల సమన్వయ అధికారిని ఆదేశించారు. | పనులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ కాలయాపన చేస్తుంటే మీరుండి ఏం చేస్తున్నారని టీఎస్ ఎండిసి ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాల్సిన పరికరాలు ఎప్పుడొస్తాయనే సమాచారం మీ దగ్గర ఉండదు, రహదారి లేదని 18 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని అందుబాటులోకి తేకుండా వదిలేస్తారా అక్టోబర్ 10వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని ఇంజనీర్లును ఆదేశించారు. ఏ ఏ పరికరాలు కావాలన్న కనీస అవగాహన కూడా లేకపోతే ఎలా అని అన్నింటికి యండి అని సమాధానం చెప్తున్నారు, యండితో నేను మాట్లాడితే మీరుండి దేనికని, ఇన్ని రోజులు నుండి ఏం చేస్తున్నారని పరికరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీదికాదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మీ మాటలు వినే స్థాయిలో నేను లేనని, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 10 వతేదీ వరకు సిసిరోడ్లు, ఆసుపత్రిలో పరికరాలు, డ్రెయిన్ నిర్మాణ పనులు పూర్తి చేసి సేవలు అందించడానికి సిద్ధం చేయాలని చెప్పారు. పనిచేయని సిబ్బందివల్ల ఇబ్బందులు వస్తున్నాయని అటువంటి వారిని సర్వీస్ నుండి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, పనిచేయని వారు ఉన్నా లేకపోయినా ఒకటేనని స్పష్టం చేశారు. రామవరం ఆసుపత్రికి మున్సిపాల్టీ ద్వారా ప్రధాన రహదారి నుండి ఆసుపత్రి వరకు లైటింగ్ ఏర్పాట్లు చేపిస్తానని చెప్పారు. కోవిడ్ నేపద్యంలో పాల్వంచ తరలించిన ప్రసవ కేంద్రాన్ని తిరిగి కొత్తగూడెంలో తిరిగి ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి ఆసుపత్రిలో బర్త్ ప్లానింగ్ తయారు చేయాలని చెప్పారు. ఇన్ని ఆసుపత్రులున్నా గర్భిణీ మహిళలు రక్తహీనతో బాధపడుతూ ప్రమాదబారిన పడుతున్నారని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి గర్భిణి యొక్క వివరాలు ఆన్లైన్ చేయాలని చెప్పారు. హైరిస్క్ ఉన్న గర్భిణి మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పారు. మాతా శిశు మరణాలను లేకుండా చేయాలని చెప్పారు. జిల్లాలో టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి వచ్చినందున అంతర్జాల సేవలకు అంతరాయం లేకుండా అన్ని ఆసుపత్రులకు అంతర్జాల సేవలకు డాంగిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాల సేవలు వల్ల ఓపి సేవలు తగ్గుతాయని ఆయన సూచించారు. కోవిడ్ నియంత్రణలో ఎంతో బాగా పనిచేశారని అదే స్పూర్తితో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరావు, సూపరింటెండెంట్ సరళ, ఆర్ఐఓ రవిబాబు, భద్రాచలం ఆసుపత్రి పర్యవేక్షకులు రామక్రిష్ణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.