అధికారులు అంకితభావంతో పనిచేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

అధికారులు అంకితభావంతో పనిచేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 2: అధికారులు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలచే చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలు, చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నివేదికలలో పొందుపరచిన ప్రకారం క్షేత్ర స్థాయిలో ప్రగతి కన్పించాలన్నారు. జిల్లాలో 281 వైకుంఠదామాల నిర్మాణాలకు గాను 278 నిర్మాణాలు పూర్తికాగా, 3 చోట్ల పురోగతిలో వున్నట్లు, పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పూర్తయిన వైకుంఠదామాల్లో 244 లకు మిషన్ భగీరథ ద్వారా నీటి సౌకర్యం కల్పించగా, మిగతా చోట్ల ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని గ్రామాల్లో సేగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు పూర్తయి వాడుకలో వున్నట్లు, ఇందులో 3 ఎన్జిటి ద్వారా, మిగతా 278 నాన్ ఎన్జిటి ద్వారా నిర్మించినట్లు ఆయన అన్నారు. ఎన్జిటి ద్వారా నిర్మించిన సేగ్రిగేషన్ షెడ్ల నిర్వహణలో ఎన్జిటి వారి నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. తడి, పొడి చెత్తను ఇండ్ల వద్దే వేరు చేసి అందించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. మండల ప్రత్యెక అధికారులు, వార్డు ప్రత్యెక అధికారులు ఇట్టి విషయమై పర్యవేక్షణ చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో 281 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తి చేసినట్లు, మొక్కల సంరక్షణపై ప్రత్యెక దృష్టి పెట్టాలన్నారు. అన్ని గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు పూర్తి అయినట్లు, డిమాండ్ మేరకు మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు ఈ సంవత్సరం 33 లక్షల 53 వేల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటికి 77 శాతం మొక్కలు నాటినట్లు, లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తిచేసి, ఆన్లైన్ నమోదు వంద శాతం చేయాలన్నారు. ప్రతి శుక్రవారం వాటర్ డే ను చేపట్టి, మొక్కలన్నింటికి నీరందించడం చేయాలన్నారు. జిల్లాలోని 62 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తిచేసుకున్నట్లు, ఏదేని చోట చిన్న చిన్న పనులు, నీటి సరఫరా తదితరాలు వుంటే, వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాకు మంజూరయిన 2 వేల 570 రైతు కల్లాల్ల్లో పూర్తికాని చోట్ల త్వరితగతిన చేపట్టి పూర్తిచేయాలన్నారు. ఉపాధిహామి క్రింద జాబ్ కార్డ్ వున్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, పని దినాల లక్ష్యాన్ని సాధించాలని ఆయన అన్నారు. అటవీ శాఖ ద్వారా 3 లక్షల టేకు మొక్కలు సమకూర్చుకొని, డిమాండ్ మేరకు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని 281 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ లను సమకూర్చుకున్నట్లు, పారిశుద్ద్యం పకడ్బందీగా చేపట్టాలన్నారు. పన్నుల వసూలు వంద శాతం చేయాలన్నారు. జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేట్ 1 నుండి 1.5 శాతం వున్నట్లు, 213 యాక్టివ్ కేసులు జిల్లాలో వున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలోని 4 సామాజిక, 11 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ రాపిడ్ పరీక్షలు, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన డయాగ్నోసిస్ కేంద్రంలో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేపట్టుచున్నట్లు కలెక్టర్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభానికి సిద్దంగా వున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో సీజనల్ హెల్త్ సర్వే చేపడుతున్నట్లు, ఇప్పటివరకు ఒక్క డెంగ్యూ కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. సిటి స్కాన్ విషయమై చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. రైతులకు సరిపోను ఫర్టిలైజర్ అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో 400 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం కాగా, 86 మంది రైతులు సాగుకు ముందుకు వచ్చినట్లు, లక్ష్యం సాధన దిశగా వెళుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయిల్ ఫామ్ నర్సరీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 9 రిజర్వాయర్లు, 804 చెరువులు, కుంటలలో చేప పిల్లలు వదులుటకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. పశు సంవర్థక శాఖ ద్వారా పశువులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. రెండో విడత క్రింద 10 వేల 954 గొర్రెల యూనిట్లకు గాను 4 వేల 300 యూనిట్లు లబ్దిదారులకు అందజేసినట్లు, మిగతా యూనిట్ల గ్రౌ౦డింగ్ కు చర్యలు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాదకరంగా వున్న భవనాలను ఇంజనీరింగ్ అధికారులతో తనిఖీ చేయించి, వాటి స్థితిపై ధృవీకరణ తీసుకోవాలని, ప్రమాదకరంగా వున్న చోట విద్యార్థులను ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో తరగతులు నిర్వహించాలని ఆయన అన్నారు. పాఠశాలల్లో కోవిడ్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, పారిశుద్ద్యం ప్రతిరోజు చేపట్టాలని అన్నారు. సిఎంఆర్ బియ్యం లక్ష్యం పూర్తిచేయాలన్నారు. మిషన్ భగీరథ లో మిగులు పనులుంటే వెంటనే పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో టూరిజం అభివృద్దికి చేపట్టిన పనులు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. మంజూరయిన డబల్ బెడ్ రూం ఇండ్లలో నిర్మాణాలలో ఇంకనూ పనులు చేపట్టని చోట, వెంటనే ప్రారంభించాలని, లక్ష్యం త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. ప్రతి బుధవారం మండల ప్రత్యెక అధికారులు వారి వారి మండలాల పర్యటన చేసి, పనుల పురోగతిని పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. క్షేత్ర తనిఖీలు చేపట్టనున్నట్లు, అధికారులు అప్రమత్తంగా వుండాలని, జవాబుదారితనంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జెడ్పి సిఇవో ఎల్. విజయలక్ష్మి, డిఆర్డివో జి. రాంరెడ్డి, డిపివో కె. రంగాచారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది


Share This Post