అధికారులు అప్రమత్తంగా ఉండాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

మహబూబాబాద్-జూలై 22:

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయం నుండి భారీ వర్షాలపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ముందుగా భారీ వర్షాలకు పాకాల, మున్నేరు, ఆకేరు, అలిగేరు నదులు వరదలతో ఉప్పొంగుతున్నందున ఇరువైపులా ప్రజలు రాకపోకలు కొనసాగించే ప్రాంతాలకు రెవెన్యూ, పోలీసు అధికారులు బారికేడ్ ఏర్పాటు చేసి, భద్రతా చర్యలు తీసుకునేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయలన్నారు.

చెరువుల వద్ద నీటిపారుదల అధికారులు భద్రతా చర్యలు చేపట్టాలని, ఇసుక పథకాలను సిద్ధం చేసుకోవాలి అన్నారు.

వైద్య శాఖ అధికారులు గర్భిణీ స్త్రీలను ముందస్తుగా వైద్యశాలకు తరలించాలన్నారు. 102, 108 వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలి అన్నారు.

అత్యవసరమైన పరిస్థితులలో సేవలందించేందుకు అంబులెన్సులను, ఫైర్ ఇంజన్ లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

పోలీసు, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు వాగులు వంకలు వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తం చేయాలని, వరద ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.

నిత్యవసర వస్తువులను త్వరితగతిన పంపిణీ చేయాలని, వరద ముంపుకు గురైన లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా భోజన వసతి కల్పించాలన్నారు

అధికారుల అనుమతి లేనిదే మత్స్యకారులు చేపలు పట్టరాదన్నారు.

వ్యవసాయ రైతులు తమ పంట పొలాల్లో మోటార్ స్విచ్ లను వేసేందుకు వెళ్ళ రాదని, విద్యుత్ అధికారులు ముందస్తు చర్యగా సంబంధిత ఫీడర్లను నిలుపుదల చేయాలన్నారు.

దంతాలపల్లి మండలం కుమ్మరి కుంట్ల, పెద్దముప్పారం ప్రదేశాలలోనూ గార్ల మండలం రాంపురం వద్ద, అలాగే బయ్యారం, గార్ల మండలాల మధ్య ఉన్న సత్యనారాయణపురం వద్ద, కురవి, నేరడ గ్రామాల మధ్య, గూడూరు, కేసముద్రం మధ్య పాకాల నుండి వచ్చే వరద ప్రభావిత ప్రాంతాలలో సిబ్బందిని నియమించి సైన్ బోర్డు ఏర్పాటు చేయలన్నారు.

శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను గుర్తించి అందులో నివాసం ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.

రహదారులు తెగిపోతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని పునరుద్ధరించాలి అన్నారు.

తాగునీటికి ఇబ్బందులు కాకుండా లీకేజీలను అరికడుతూ నిరంతర సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులు రోజువారి నివేదికలు అందజేయాలని కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ కొమరయ్య, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు.
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారిచేయనైనది

Share This Post