అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేస్తూ దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలనిరాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మీదట అనతి కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దశాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, పల్లె పల్లెన తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేస్తూ దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ తన దార్శనిక పాలనతో కేవలం తొమ్మిదేళ్ల స్వల్ప
వ్యవధిలోనే యావత్ దేశం ఆశ్చర్యపోయే రీతిలో అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు.తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో జాతీయ వృద్ధి రేటుతో ఇతర అనేక రాష్ట్రాల వృద్ధి రేటు దిగజారిందని, తెలంగాణ వృద్ధి రేటు మాత్రం నాలుగు శాతం పెరిగిందని వివరించారు. వ్యక్తి కేంద్రంగా మానవీయ కోణంలో కొనసాగుతున్న కేసీఆర్ జనరంజక పాలనతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు విశేషంగా లబ్ది చేకూరుతోంది, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు అనితర సాధ్యమైన అభివృద్ధిని సంతరించుకున్నాయని అన్నారు. దేశ వ్యాప్తంగా కేవలం మూడు శాతం జనాభా మాత్రమే కలిగి ఉన్న తెలంగాణకు జాతీయ స్థాయిలో వరుసబెట్టి 36 శాతం మేర వివిధ అభివృద్ధి అంశాల ప్రాతిపదికన అవార్డులు వరిస్తుండడం తెలంగాణ ప్రభుత్వ సుపరిపాలన తీరుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు అడ్డం పడుతోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో సాగు రంగం ఐదింతలు అభివృద్ధి చెందిందని అన్నారు. 2014 వరకు కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట సాగయ్యేదని, ప్రస్తుతం పంటల పెట్టుబడి, ఉచిత విద్యుత్, సాగునీటి వసతి కల్పించడంతో 56 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తున్నారని వివరించారు. వరి సాగులో పంజాబ్ ను సైతం అధిగమిస్తూ, దేశం మొత్తంలో యాభై శాతం ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రమే సాగు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. వ్యవసాయం అనే కాకుండా ఏ రంగాన్ని చూసినా కనీసం మూడింతల అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని,యాదాద్రి ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్, ఐటి హబ్, కేబుల్ బ్రిడ్జీలు,ఫ్లైఓవర్లు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం, నూతన సచివాలయ నిర్మాణం, అమర వీరుల స్మారక చిహ్నం వంటి అనేక ప్రఖ్యాత కట్టడాలను అనతి కాలంలోనే పూర్తి చేసుకోవడాన్ని చూసి ప్రపంచమే అబ్బురపడుతోందని అన్నారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లాలో ప్రపంచ దిగ్గజ ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించిన సమయంలో ఆ కంపెనీ చైర్మన్ సైతం తెలంగాణ ప్రగతిని వేనోళ్ళ కీర్తించారని మంత్రి గుర్తు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని, మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలని, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాలేశ్వరం లాగే పాలమూరు
రంగారెడ్డిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగు, సాగునీరు తీసుకు రావాటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలియ జేశారు.
రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో సాధించినప్రగతిని గర్వాంగా చాటుకుంటు ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని, ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు, రైతు భీమా, వివిధ రకాల పెన్షన్లు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, చెరువుల్లో వదిలిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలియ జేశారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అందజేయాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారి కృషితో గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించినఅభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను పునఃశ్చరణ చేసుకుంటూ ప్రజలకు వీటి గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను చేపడుతోందని అన్నారు. పండుగ వాతావరణంలో ఉత్సాహభరితంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని మంత్రి సూచించారు. అందరి సహకారం, భాగస్వామ్యంతోనే వేడుకలు విజయవంతం అవుతాయన్నారు. తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వివిధ వర్గాల ప్రజలకు చేకూరిన మేలు గురించి శాఖల వారీగా కరపత్రాలు, ఫ్లెక్సీలు, బుక్ లెట్ల ద్వారా తెలియజేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్, సాగునీటి రంగం, పారిశ్రామిక ప్రగతి, విద్య, వైద్యం, సంక్షేమం, ఐ.టీ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకువిశదపర్చాలన్నారు నియోజకవర్గాలకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా, మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని అన్నారు. అధికారులు,ప్రజా ప్రతినిధులు మమేకమై ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.
ఈ సందర్భంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమం ఉంటుందని,3న అన్ని రైతు వేదికల్లో రైతు దినోత్సవం జరుపాలని, 4న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దివస్, 5న విద్యుత్ విజయోత్సవం, 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాలను నిర్వహించాలని వివరించారు. 9నతెలంగాణ సంక్షేమ సంబరాలను, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని, 11నసాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం, 15న పల్లె ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న తెలంగాణ మంచినీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. 20న తెలంగాణ విద్యా దినోత్సవంలో భాగంగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో జెండాను ఎగుర వేయాలని, విద్యాలయాలను అందంగా ముస్తాబు చేయాలని, విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయాలని, వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాలని, మన ఊరు – మన బడి పనులు పూర్తయిన చోట పాఠశాలలను ప్రజా ప్రతినిధులచే ప్రారంభోత్సవాలు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను అలంకరింపజేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. 22 న అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే జిల్లాఅధికారులతో సమావేశం నిర్వహించి ఉత్సవాలు విజయవంతం చేయుటకు కృషి చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా హరనాథ్ రెడ్డి, ఎమ్యెల్సీలు సురభి వాణి దేవి, దయానంద్,ఎగ్గే మల్లేశం, శాసన సభ్యులు సుధీర్ రెడ్డి,కాలే యాదయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆరికె పూడి గాంధీ, అంజయ్య యాదవ్ జైపాల్ యాదవ్, అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, ఆయా మండలాల తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, మునిసిపల్ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post