అధిక ఆదాయం ఇచ్చే పంటలు, మార్కెట్లో డిమాండ్ వుండే పంటలు పండించే విధంగా రైతాంగానికి అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జిల్లా యంత్రాంగానికి, వ్యవసాయ అధికారులకు సూచించారు.

బుధవారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో  యాసంగి 2021లో వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా పంటల సాగు,  ధాన్యం కొనుగోలు పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,  వచ్చే యాసంగిలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విషయం రైతులకు వివరించాలని,  రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించడంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,  వరి వద్దు ఆదాయం ఇచ్చే ఇతర పంటలు ముద్దు అనే విషయం రైతులకు క్షుణ్ణంగా తెలిసేలా వివరించాలని, ప్రభుత్వం అన్ని రకాల విత్తనాలను ఏర్పాటు చేసిందనే విషయం రైతులకు తెలుపాలని అన్నారు.  వ్యవసాయ అధికారులకు వ్యవసాయ పద్ధతులపై పూర్తి అవగాహన ఉండాలని,  రాబోయే ప్రమాదం నుండి రైతులను కాపాడుకునేందుకు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కందులు, నువ్వులు, మినుములు, ఆవాలు, పెసర్లు,  వేరుశనగ, పామాయిల్ తదితర పంటలపై అవగాహన కల్పించాలని,  ఏ విత్తనం ఎప్పుడు వాడాలి,  ఏ మందులు వాడాలి అనేది ఎప్పటికప్పుడు అవగాహన కలిగించాలని అన్నారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సారవంతమైన నేలలు ఉన్నాయని,  ఈ భూములను సరైన పద్ధతిలో రైతులు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని,  అందుకుగాను డిమాండ్ ఉన్న పంటలపై రైతులు దృష్టి పెట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.  కేంద్రం వానాకాలంలో దాన్యం కొనుగోలు చేయలేమని, ధాన్యం నిలువలు ఎక్కువయ్యాయని చెప్పినందున మన ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానమంత్రి, హోం శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులను కలిసి రైతుల ఇబ్బందులను వారి దృష్టికి తెచ్చారని అన్నారు.  యాసంగిలో ఒక గింజ కూడా కొనలేమనే కండిషన్ పై ఇప్పుడు వానకాలం ధాన్యాన్ని కొంటామని కేంద్రం తెలిపిందని, యాసంగి ధాన్యాన్ని కూడా కలిపి ఇప్పుడే కేంద్రం కొంటున్నదని, ఈ విషయం రైతులకు వివరంగా తెలియ చేయాలని అధికారులకు సూచించారు.  ఏ పంట కూడా ఏ ఇతర పంటకు ప్రత్యామ్నాయం కాదని,  ప్రతి పంట కూడా పండించేదేనని,  ప్రజలకు అవసరమేనని అన్నారు. దేశంలో మన తెలంగాణ ప్రత్తికి గిరాకీ ఎక్కువ అని,  డిమాండ్ చాలా ఉందని, అలాగే మామిడి పండ్లు కూడానని,  మన సారవంతమైన భూమే దీనికి కారణమని అన్నారు.  తెలంగాణ
అద్భుతమైన భూమి, రైతాంగం ఉండి కూడా నీరు లేక గతంలో చాలా గోస పడ్డామని అన్నారు.  నిజానికి వరి లోనే తక్కువ ఆదాయం వస్తుందని,  రైతులు వరికి అలవాటు పడ్డారని అన్నారు. గతంలో రైతులే కూరగాయలు పండించారని ప్రస్తుతం కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితులు మారాలన్నారు.  నూనె గింజల దిగుబడిలో మనం బయటి దేశాల నుండి 80 వేల కోట్లతో దిగుమతి చేసుకుంటున్నామని,  డిమాండ్ ఉన్న ఇలాంటి పంటలు రైతులు పండించేలా వారికి తెలపాలని అన్నారు.  స్థానిక అవసరాల నిమిత్తం స్థానిక ఉత్పత్తులు పెంచాలని,  తెలంగాణలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయని,  అద్భుతమైన డిమాండ్ వున్న పంటలు కూడా పండించవచ్చునని , చాలామంది రైతులు కూరగాయల సాగు ద్వారా అధిక లాభాలు పొందుతున్నారని,  వారు తమ తోటి రైతులకు మార్గదర్శకం కావాలని కోరారు.  రైతులు తమ సమస్యలను కూర్చుని మాట్లాడుకునేందుకు,  వారికి తగిన సలహాలు ఇచ్చేందుకు వేదికగా నిర్మించిన రైతు వేదికలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని,  ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి అని,  రైతులను కాపాడుకొనేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నదని‌,  మన ముఖ్యమంత్రి గత ఏడు సంవత్సరాలుగా తీసుకున్న చర్యల వల్లనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని,  అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా దారిద్య్రం నుండి అన్నం పెట్టే స్థితికి వచ్చిందని అన్నారు.
ధాన్యం కొనుగోలుపై  మంత్రి మాట్లాడుతూ,  జిల్లాలో ఇప్పుడు రెండు లక్షల 79 వేల 808 ఎకరాల్లో వరి సాగు జరిగిందని, దాదాపు  ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోతుందని అన్నారు.  గతంలో ఏర్పాటు చేసిన విధంగానే 187 సెంటర్ల ద్వారా కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని తెలియజేస్తూ, కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని,  రవాణా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, ఎక్కడ కూడా ఎలాంటి సమస్య రాకుండా రైతుల నుండి సజావుగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీత రెడ్డి,  జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి,  ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,  జిల్లా అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి,  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, మార్కెటింగ్,  సివిల్ సప్లై  అధికారులు,  డీలర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

అధిక ఆదాయం ఇచ్చే పంటలు, మార్కెట్లో డిమాండ్ వుండే పంటలు పండించే విధంగా రైతాంగానికి అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జిల్లా యంత్రాంగానికి, వ్యవసాయ అధికారులకు సూచించారు.

Share This Post