అధిక వర్షాలతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు30 (సోమవారం).

అధిక వర్షాలతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాలతో ఎలాంటి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నoదున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ తదితర అన్ని శాఖల అధికారుల సమన్వయం చేస్తూ భారీ వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేస ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా అధిక వర్షాలతో నదులు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తాయి కాబట్టి చేపల వేటకు వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, లోలెవెల్ వంతెనల మీదుగా ప్రజలు రవాణా జరగకుండా చూడాలని, పాడుపడ్డ భవనాలు, విద్యుత్ స్తంభాల దగ్గరికి ప్రజలను వేళ్ళనివ్వరాదని ఇప్పటికే 90 శాతానికి పైగా నిండి ఉన్నా చెరువుల పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు పరిశీలించి అవసరమైతే నీటిని కిందికి వదలాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని అన్నారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు ఎవరు సెలవులపై వెళ్లరాదని ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెడ్ క్వార్టర్ మెయింటెన్ చేయాలని అన్నారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జిల్లాలో వరదలు సంభవించినప్పుడు ప్రజలు పడ్డ ఇబ్బందులను, తీసుకున్న చర్యల అనుభవంతో అధిక వర్షాలను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా ప్రజలను వరద తాకిడి ప్రాంతాలకు, ప్రమాదకరంగా ఉన్న వంతెనల వద్దకు, చేపల వేటకు వెళ్లకుండా ప్రజలను అలర్ట్ చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య మాట్లాడుతూ అధిక వర్షాలతో సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరియు ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలలోని లోతట్టు నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖల సహకారంతో 24 గంటలు భారీ వర్షం, వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్. దివాకర, జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post