అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో అర్హులైన అసంఘటిత రంగ కార్మికులను గుర్తించి వారికి ఇ-శ్రమ్. e-SHRAM పోర్టల్ లో ఉచిత నమోదు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.

సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఇ-శ్రమ్ పోర్టల్ లో అసంఘటిత రంగ కార్మికుల  ఉచిత నమోదు ప్రక్రియపై శాఖల వారీగా సమీక్షిస్తూ,  తమ తమ శాఖలలో అర్హులైన కార్మికులు  ఎంతమంది ఉన్నారో గుర్తించాలని, వారందరినీ నమోదు చేపట్టి వారికి సామాజిక భద్రత,  వివిధ సంక్షేమ పథకాలను అందించడంలో భాగస్వాములు చేయాలని ఆదేశించారు.  కేంద్ర ప్రభుత్వ పథకం ఇ-శ్రమ్ లో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల ప్రమాద మరణం/ అంగవైకల్య బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు కార్మిక శాఖ ద్వారా జిల్లాలో 5862 మంది కార్మికులు పోర్టల్ లో నమోదు కావడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసి ప్రయోజనం చేకూర్చాలని తెలిపారు.  ఈ పథకంలో చేరడానికి 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు లోపు ఉండి ఆదాయపు పన్ను,  ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్,  ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ సదుపాయం లేని వారు దీనికి అర్హులని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ ఉపాధులు,  నర్సరీలు, పాడి పరిశ్రమ, ఉద్యానవన, మత్స్యకార, భవన అనుబంధ రంగాలలో,  టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకర్,  ఆటోమొబైల్,  రవాణా రంగం, డ్రైవర్లు, హెల్పర్లు, చేతి వృత్తులు‌, స్వయం ఉపాధి వ్యాపారులు, చిరువ్యాపారులు, కల్లుగీత, రిక్షా కార్మిక,  బీడీ కార్మికులు, సేవారంగం, కొరియర్ బాయ్స్,  ఇంటి వద్ద రోగులకు సేవలు అందించేవారు,  అలాగే ప్రభుత్వ పథకాల అమలులో  పనిచేస్తున్న ఉపాధిహామీ కూలీలు,  ఆశావర్కర్లు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, విద్యా వాలంటీర్లు, గ్రామ వార్డు వాలంటీర్లు, హమాలీలు, దుకాణాల్లో, సంస్థలలో పనిచేసేవారు, ఫాస్ట్ ఫుడ్ తయారీదారులు, వలస కార్మికులు, తదితర రంగాలకు చెందిన వారు, వ్యవసాయ రంగంలో క్రాప్ బుకింగ్ చేసుకున్న వారు, గ్రామాలలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్స్ , వైద్య రంగంలో పనిచేస్తున్న సిబ్బంది,  ఉపాధి హామీ కూలీలు, వన సేవకులు అందరూ అర్హులని తెలిపారు. వీరికి ఉచితంగా గ్రామ పంచాయతీలు,  కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అధికారులు తమ పరిధిలోకి వచ్చే అర్హులైన ప్రతి ఒక్కరిని నమోదు చేసే కార్యక్రమం వేగవంతంగా చేపట్టాలని, టామ్ టామ్ కార్యక్రమాల ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి,  జిల్లా కార్మిక అధికారి వాల్యా నాయక్ , జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు,  జిల్లా పంచాయతీ అధికారి సునంద,  జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ,  జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి,  జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి యాదయ్య, ఎస్.టి. సంక్షేమ అధికారి మంగ్తానాయక్,  మున్సిపల్ కమిషనర్ పురుషోత్తం, వివిధ కార్మిక రంగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post