అన్యాయాన్ని సహించనని పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ : జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి

నిజాం సర్కారు బానిసత్వం నుండి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి అన్యాయాన్ని సహించని పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. ఆదివారం 126వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ పోరాట కాలంలో హక్కుల కోసం పోరాడారని, చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను భావితరాలు తెలుసుకునే విధంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళలు ఇంటికి మాత్రమే పరిమితమైన సమయంలో ఒక మహిళగా సమాజ శ్రేయస్సు కోసం పోరాడారని తెలిపారు. సాయుధ పోరాటంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సేవలు సైతం అందించారని, రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడారని, మన సమస్యలను ఎవరో వచ్చి పరిష్కరిస్తారని ఎదురు చూడకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకునే విధంగా ముందుకు సాగాలని తెలిపారు. దేశం కోసం పోరాడిన మహనీయులు ఏ ఒక్క కుల, మత, జాతి, వర్ణ, వర్గాలకు చెందిన వారు కాదని, వారు దేశానికి చెందిన వారని అన్నారు. మహనీయులు చూపిన మార్గదర్శకాలను అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నజీమ్ అలీ అప్సర్, రజక సంఘం నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది

Share This Post