అభివృద్ధిలో తెలంగాణ అగ్రపథాన ఉందనడానికి కేంద్ర ప్రభుత్వ సర్వేనే తార్కాణం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరింత సర్వతోముఖాభివృద్ధి కోసమే పల్లె/పట్టణ ప్రగతి అని వెల్లడి

అభివృద్ధిలో యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉందనడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేనే తార్కాణమని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నీటి వసతి, విద్యుత్, పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి అంశాల ప్రాతిపదికగా దేశంలోనే అత్యుత్తమమైన పది గ్రామాలను కేంద్ర ప్రభుత్వం సర్వే ద్వారా ఎంపిక చేయగా, మొత్తం పదికి పది తెలంగాణలోని పల్లెలే ఎంపికయ్యాయని మంత్రి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. అనంతరం మళ్ళీ మరో పది గ్రామాలను ఎంపిక చేస్తే మొత్తం 20 గ్రామాల్లో 19 పల్లెలు తెలంగాణాకు చెందినవే ఉన్నాయని వెల్లడించారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన పాల్డ, వెల్మల్, తానాకుర్దు, కుకునూర్, కందకుర్తి గ్రామాలు ఉండడం ఎంతో గర్వకారణమని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు.
జూన్ 3 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న ఐదవ విడత పల్లె ప్రగతి, నాల్గవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే మరే ఇతర రాష్ట్రాల్లో లేనివిధంగా గ్రామాల సమగ్ర అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్ధిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల నిర్వహణకే సరిపోతున్న దరిమిలా మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధుల కొరత ఏర్పడుతుండడాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిధుల లేమి లోటును భర్తీ చేస్తోందన్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్ధిక సంఘం నిధులకు సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు అంతే మొత్తంలో నిధులు సమకూరుస్తుందని తెలిపారు. ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలలో మౌలిక సదుపాయాలూ అందుబాటులోకి వచ్చి అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్ర సర్వే ద్వారా రుజువు అయ్యిందని అన్నారు. పల్లె ప్రగతిని 2019 సెప్టెంబర్ నుండి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చామని, ఈ స్వల్ప వ్యవధిలోనే ఇప్పటివరకు ఒక్క నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలకే రాష్ట్ర ప్రభుత్వం 485 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు కేటాయించిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు. సగటున ఒక్కో గ్రామానికి సుమారు కోటి రూపాయల చొప్పున నిధులు రాష్ట్ర ప్రభుత్వం తరపున సమకూరాయని అన్నారు. వీటితో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల కల్పన పనుల కోసం మరో 400 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ దార్శనికత, ముఖ్యమంత్రి ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని, ప్రభుత్వ సంకల్పానికి అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి తోడవడంతో తెలంగాణా రాష్ట్రం అభివృద్ధిలో దేశమంతటికీ గర్వకారణంగా నిలుస్తోందని కొనియాడారు.
ఇదే స్పూర్తితో ప్రస్తుతం చేపడుతున్న పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ మరిన్ని సత్ఫలితాలు సాధించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ, నిర్దేశిత కార్యక్రమాలు నూటికి నూరు శాతం అమలయ్యేలా చూడాలన్నారు. దీనికోసం ముందస్తుగానే క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి వాస్తవ పరిస్థితులతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాలికను రూపొందించుకోవాలని సూచించారు. అన్ని వైకుంఠధామాల్లో తప్పనిసరిగా నీటి వసతి, విద్యుత్ సౌకర్యం ఉండాలని, రోడ్లకు ఇరువైపులా, చెరువులు, కాల్వ గట్లపైన, ఇతర అన్ని ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి పెద్దపీట వేస్తుండడంతో తెలంగాణలో 6 శాతం పచ్చదనం పెంపొందించబడిందని తెలిపారు. మరో మూడు శాతం పచ్చదనం పెరిగితే తెలంగాణాలో అసలు కరువు అనేదే ఉండదని, సమయానుకూలంగా రుతుపవనాలు ఏర్పడి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని మంత్రి వేముల ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కనీసం 600 కోట్ల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 400 కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించడం జరుగుతోందని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో అనూహ్య రీతిలో పచ్చదనం పెంపొందడం చూసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలే ఆశ్చర్యపోతున్నాయని అన్నారు. ఈ పరంపరను ఇదే విధంగా కొనసాగిస్తూ, పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొక్కల పెంపకం, వాటి సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, పల్లె/పట్టణ ప్రగతికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సన్నద్ధమైందని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోను అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయిస్తామని, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో పాటు ఎంపిపిలు, జెడ్పిటిసిలను ఈ సమావేశాలకు ఆహ్వానిస్తామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, ప్రభుత్వం నిర్దేశిన ప్రతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్, నగర మేయర్ నీతూకిరణ్, డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఐడిసిఎంఎస్ చైర్మన్ మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్ కో చైర్మన్ అలీం, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీ ఎఫ్ ఓ సునీల్, జెడ్పి సీఈఓ గోవింద్, డీపీవో జయసుధ, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఎంపిడిఓలు, స్పెషల్ ఆఫీసర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
——————-

Share This Post