అర్హులందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లు:: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

జనగామ, సెప్టెంబర్ 21: అర్హులైన పేదవారందరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ మండలం పెద్దపహాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 41 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలు దేశమంతా ప్రశంసలు పొందుతున్నాయన్నారు. పెద్దపహాడ్ గ్రామంలో రూ. 2కోట్ల 57 లక్షల 89 వేల ఖర్చుతో 41 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి, అర్హులైన పేదవారికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఇంకనూ గ్రామంలో అర్హులైన పేదవారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. డబల్ బెడ్ ఇండ్ల రహదారిలో వున్న కల్వర్టు నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్, సాగునీరు, త్రాగునీరు కొరత లేకుండా చేశామన్నారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల అమలు ఆపలేదన్నారు. జనగామ పట్టణ సమగ్ర అభివృద్ధికి రూ. 115 కోట్ల అంచనాలతో కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన టీకా కేంద్రాలు ఏర్పాటుచేసి, ఉచితంగా టీకాలు ఇస్తున్నట్లు, ఇప్పటివరకు తీసుకొని వారుంటే తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. టీకాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా వస్తే, సాధారణ జ్వరంలా వచ్చి పోతుందని, ప్రాణాపాయం ఉండదని ఆయన అన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు మాట్లాడుతూ, గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ లకు సంబంధించి ఇండ్ల పట్టాలు అందజేసినట్లు తెలిపారు. కరోనా కట్టడికి టీకా ఒక్కటే సరైన మార్గమని, 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరూ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాల్లో 104 సబ్ సెంటర్ల వారీగా టీకా కొరకు ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. టీకా తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని, వృద్దులు, గర్భిణులు, బాలింతలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, అందరూ టీకా తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఇస్మాయిల్, జిల్లా హౌజింగ్ నోడల్ అధికారి దామోదర రావు, జనగామ ఎంపిడివో హిమబిందు, తహసీల్దార్ రవీందర్, ఎంపిపి మేకల కళింగరాజు, జెడ్పిటిసి నిమ్మతి దీపికా మహేందర్ రెడ్డి, వైస్ ఎంపిపి, ఎంపిటిసి గద్ద చంద్రశేఖర్, పెద్దపహాడ్ సర్పంచ్ గుండ శ్రీలత శ్రీధర్ రెడ్డి, జనగామ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బాల్దే విజయ సిద్దిలింగం, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post