ప్రచురణార్థం……1
తేదీ.31.01.2023
అర్హులందరికీ పోడు భూ పట్టాల పంపిణీకి చర్యలు:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 31
జిల్లాలో అర్హులందరికీ తప్పనిసరిగా పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని, దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన అధికారులను ఆదేశించారు. పోడు భూముల పట్టాల పంపిణీ పై మంగళవారం సంబంధిత అధికారులతో స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
అర్హులందరికీ ఆర్.ఓఎఫ్.ఆర్ చట్టం ప్రకారం పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాలలో బృందాలతో సర్వే,గ్రామ సభలు, ఎస్.డి.ఎల్.సి పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఫిబ్రవరి మొదటి వారం తరువాత అర్హులకు భూ పట్టా,పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, జిల్లాలో అర్హుల ఎంపిక, వారి దరఖాస్తు ఆమోదం, పాస్ పుస్తకాలు ముద్రణ వంటి పనులు పూర్తి చేసి సన్నద్దం కావాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో పోడు భూముల పట్టాల కోసం 7568 మంది గిరిజనులు, 17826 గిరిజనేతరులు ద్వారా మొత్తం. 25394 మంది దరఖాస్తు చేసుకున్నారని, 100% క్షేత్రస్థాయిలో బృందాలతో సర్వే, గ్రామ సభలు పూర్తి చేశామని, ఎస్.డి.ఎల్.సి 689 గిరిజన దరఖాస్తులు సిఫార్సు చేసిందని, ముందస్తుగా వాటిని డి.ఎల్.సి.లో మరోసారి పరిశీలించి, ఆమోదించిన వాటిని ఎస్.ఎల్.సి.కి పంపి పాస్ పుస్తకాలు ముద్రణ కోసం వివరాలు నమోదు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో వచ్చిన 7568 గిరిజనుల దరఖాస్తలో క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో 3400 దరఖాస్తులు ఫీల్డ్ లో ఉన్నట్లు గుర్తించామని, వాటిలో 689 ఆమోదించామని, మిగిలిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆర్.ఒ.ఎఫ్.ఆర్. చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుంచి ఉన్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలని, దరఖాస్తులు పరిశీలించే సమయంలో అంతకు ముందు నుంచి భూమి సాగు ఉన్నట్లు 2 ఆధారాలు సమర్పిస్తే వెంటనే ఆమోదించాలని, ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో వచ్చిన ఏ ఒక్క దరఖాస్తును ఇప్పటి వరకు తిరస్కరించలేదని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ తిరస్కరించే దరఖాస్తులకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అర్హత ఉన్న ఏ ఒక్కరూ నష్టపోవద్దని, అదే సమయంలో అనర్హుల దరఖాస్తులు ఆమోదించివద్దని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు టి.ఎస్.దివాకర, డి.ఎఫ్.ఓ. బి.లావణ్య, ఆర్.డి.ఓ. శ్రీనివాస్, అన్ని మండలాల తహసీల్దార్ లు, ఎం.పి.డి.ఓ.లు, ఎఫ్.ఆర్.ఓ.లు., ఎం.పి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.