అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ హరీష్

అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ హరీష్

ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కని, కాబట్టి 1 జనవరి 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. బుధవారం తన ఛాంబర్లో రెవిన్యూ అధికారులతో ఓటర్ల నమోదు పై సమీక్షిస్తూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1 న ముసాయిదా ఓటర్ల జాబిజితాను ప్రకటించామని అన్నారు. ఇందులో 2,01,456 పురుష, 2,12,054 మహిళా, 7 మంది థర్డ్ జెండర్ ఓటర్లుగా మొత్తం 4,13,517 మంది తో పాటు మరో 108 మంది యెన్.ఆర్.ఐ. , సర్వీస్ ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. నియోజక వర్గం వారీగా చూస్తే మెదక్ నియోజక వర్గంలో 98,418 మంది పురుష, 1,06,339 మంది మహిళా, ఒక థర్డ్ జెండర్, 9 యెన్.ఆర్.ఐ., సర్వీస్ ఓటర్లు గా ఉన్నారని, నర్సాపూర్ నియోజక వర్గంలో 1,03,038 పురుష, 1,05,715 మంది మహిళ, 6 మంది థర్డ్ జెండర్, ఇద్దరు యెన్.ఆర్.ఐ., సర్వీస్ ఓటర్లు ఉన్నారని ఆయన వివరించారు.
ఈ ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం ఈ నెల 1 నుండి 30 వరకు నూతనంగా ఓటర్ల నమోదుతో పాటు చిరునామాలో మార్పులు, ఇతర సవరణలు చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇట్టి ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 30 వరకు స్వీకరించి 5 జనవరి 2022 న ఓటరు తుది జాబితా ప్రకటిస్తామని అన్నారు. ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఈ నెల 6,7,27,28 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామనిఆయన తెలిపారు. ప్రతి బూత్ లో బూత్ లెవెల్ అధికారులను ఏర్పాటు చేస్తున్నామని వారు ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు అభ్యంతరాలు, సవరణలు, మార్పులు చేస్తారని అన్నారు. ఒక ఓటరుకు కావలసిన అన్ని వివరాలు మొబైల్ యాప్ లో చూసుకోవడానికి భారత ఎన్నికల సంఘం ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను రూపొందించిందని అన్నారు. దీని ద్వారా కొత్త ఓటర్ గా నమోదు చేసుకోవడంతో పాటు ఒక నియోజక వర్గం నుండి మరో నియోజక వర్గం మారినప్పుడు ఈ మొబైల్ యాప్ ద్వారా మార్పు చేసుకునే అవకాశముందని, అలాగే తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేవో చూసుకోవచ్చని అన్నారు. చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించేందుకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అర్హులైన ప్రతి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని, సందేహాల నివృత్తి కోసం ఓటరు హెల్ప్ లైన్ 1950 ను సంప్రదించవచ్చని కలెక్టర్ హరీష్ పేర్కొన్నారు.

Share This Post