అర్హులైన లబ్ది దారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని కోర్ట్ హాలులో జిల్లాలోని డబల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణ శాఖ పనితీరుపై జిల్లా శాసనసభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను ఆమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణం కోసం ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు కల్పించాలని సూచించారు. రాజీవ్ గృహకల్ప, జెఎన్ఎన్యూఆర్ఎం పథకాల్లో భాగంగా జిల్లాలో నిర్మించిన ఇళ్ళను పూర్తి స్థాయిలో అర్హులైన లబ్దిదారులకు అందజేయాలని సూచించారు. కొత్తగా ఇళ్ళు నిర్మిస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలైన రోడ్డు, మంచినీరు, విద్యుత్ , డ్రైనేజి సదుపాయాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధి, శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాశ్ గౌడ్, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, యాదయ్య, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ తిరుపతి రావు , పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.