అలరించిన జానపద కళాకారుల ప్రదర్శన

అలరించిన జానపద కళా ప్రదర్శనలు

ప్రశంసించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, ఆగస్టు 14 : భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల అమర్ చంద్ కళ్యాణ మండపంలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ అస్థిత్వ జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 108 దీపాలు ప్రదర్శన, ఒగ్గుకథ, తెలంగాణ బోనాలు, దేశ భక్తి గేయాలతో కళాకారులు అలరింపజేశారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిఫలింపజేస్తూ, స్వతంత్ర సమరయోధుల త్యాగాలను కళ్లకు కట్టినట్టు కళాకారులు తమ అభినయ కౌశలాన్ని ప్రదర్శించారు. వారి కళా నైపుణ్యాన్ని ఆద్యంతం వీక్షించిన ముఖ్య అతిథులంతా ప్రశంసించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి బృందం సభ్యులు సైతం ఆలపించిన గేయాలు, నృత్యాలు స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను కళ్ల ముందు కదలాడేలా చేశాయి.
ధర్మారం మండలం పత్తిపాక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన చిన్నారులు పుణ్య భూమి నా దేశం గేయం పై చేసిన ప్రదర్శన వీక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు చేసిన ప్రదర్శన ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు
అనంతరం పోతుగంటి శ్రీనివాస్ నిర్వహించిన 108 దీపాలు ఓగ్గు కథ ప్రదర్శన అలరించింది.
దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన జానపద ప్రదర్శనలు భారతీయ కళా వైభవాన్ని చాటాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో జానపద కళా ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కళాకారులకు అవకాశం కల్పించామని తెలిపారు. తెలంగా సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిఫలింపజేస్తున్న కళాకారులను అన్ని వర్గాల వారు ఆదరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సాంస్కృతిక కళా వైభవాన్ని చాటేలా కళాకారులు ఆకట్టుకునే రీతిలో ప్రదర్శనలు చేశారని ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందించారు. ప్రజల్లో జాతీయతా భావాన్ని, దేశం పట్ల ప్రేమను పెంపొందించేందుకు కళా రూపాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఆంగ్లేయుల దాస్య శృంఖలాల్లో బందీగా మారిన భారతమాతకు విముక్తి కల్పించేందుకు ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తూ ఉన్నతమైన జీవితాన్ని వెళ్లదీస్తున్నామని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ దేశాభ్యున్నతికి పాటుపడాల్సిన గురుతర బాధ్యతను ప్రతి ఒక్కరు నిర్వర్తించాలన్నారు. ఈ కోవలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవ కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొంటూ జాతీయ స్ఫూర్తిని చాటుతున్నారని కలెక్టర్ తెలిపారు.

ఇదే తరహా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడించాలని, 16 వ తేదీన ఉదయం 11 . 30 గంటలకు ఎక్కడివారక్కడ తప్పనిసరిగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని కలెక్టర్ కోరారు.

అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కళాకారులను కలెక్టర్ సత్కరించారు. 75 సంవత్సరాల స్వాతంత్రం పురస్కరించుకొని అమర్ చంద్ కళ్యాణ మంటపం ఆవరణలో వేడుకలు జరుపుతూ పెద్ద ఎత్తున బాణాసంచా పెల్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి,మహిళలు పాల్గొన్నారు.

Share This Post