తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేటులోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఈ కవి సమ్మేళనానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన సుమారు 80 మంది కవులు తమ సందర్భోచిత కవితా వచనాలతో సమ్మేళనానికి వన్నెలద్దారు. ఒకరికొకరు దీటుగా అక్షర విన్యాసాలు, పదబంధాలను ప్రయోగిస్తూ సాహితీ పిపాసుల మనసులను రంజింపజేశారు. సాయంత్రం సమయంలో ప్రారంభమైన ఇందూరు కవుల కవితా ఝరి అలుపెరుగని ప్రవాహంలా రాత్రి వరకు కొనసాగింది. దాశరథి నుండి జాలువారిన నా తెలంగాణ కోటి రతనాల వీణకు కొనసాగింపు అన్న చందంగా తెలంగాణ ఉద్యమ ప్రాశస్త్యం, పోరుబాటలో నిజామాబాద్ గడ్డ పోషించిన పాత్ర, సాహితీ లోకంలో ఈ ప్రాంతానికి గల ప్రత్యేకత గురించి కవులు వీనులవిందుగా తమదైన రీతిలో కవితాత్మకత ధోరణిలో అభివర్ణించారు. ప్రస్తుత సమాజంలో సాహితీ రంగం పోషిస్తున్న పాత్ర గురించి విడమరచి చెప్పారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ,ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు మూడు సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలను నిర్వహించుకోలేకపోయామని అన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కవి సమ్మేళనం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని అన్నారు. ఎంతో గొప్పదైన తెలంగాణ భాషా సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని సాహితీవేత్తలు దశదిశలా చాటాలని, జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలని కవులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏ ఓ సుదర్శన్, తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ త్రివేణి, ప్రముఖ కవులు డాక్టర్ కాసర్ల నరేష్, పీవీ చందన్ రావు, శారదా హన్మాండ్లు, ఘనపురం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
——————————–