అవగాహన సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించేందుకు వీలుగా మాక్లూర్ మండలం మామిడిపల్లి లోని శ్రీ అపురూప వేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలో గల కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించనున్న నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా సదస్సును పురస్కరించుకుని ఏర్పాట్లను గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. తన వెంట ఉన్న పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు తదితరులతో కలిసి సదస్సు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. సమావేశ మందిరం, వేదిక, వాహనాల పార్కింగ్, ముఖ్య అతిథుల స్వాగత ఏర్పాట్లు తదితర వాటి గురించి కలెక్టర్ అధికారులతో చర్చించారు. సదస్సుకు హాజరయ్యే వారి వివరాలు నమోదు చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్లను పరిశీలించారు. వేదికకు ఇరువైపులా డిస్ ప్లే స్క్రీన్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాగు నీటి వసతిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఆయా గ్రామాల రైతు బంధు సమితి సమన్వయకర్తలు, మండల రైతుబంధు కోఆర్డినేటర్లు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు, మార్కెట్ కమిటీల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు (జెడ్ పి టి సి లు) వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్) చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు. ఇదిలా ఉండగా, మంత్రులు, స్పీకర్, ఇతర ప్రజాప్రతిధులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ నాగరాజు సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీ సీ పీ వినీత్, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీవోలు రవి, శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్, డీసీవో సింహాచలం తదితరులు ఉన్నారు.
————————-

Share This Post