అసంఘటిత రంగాల కార్మికులు ఈ-శ్రమ (e-SHRAM) లో నమోదవ్వాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 30: జిల్లాలోని అసంఘటిత కార్మికులందరు కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా చేపట్టబడుతున్న ఈ-శ్రమ (e-SHRAM) పధకంలో నమోదుచేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పధకం 26 ఆగస్టు, 2021 న ప్రారంభించబడినట్లు, దగ్గరలోని సి.ఎస్.సి. కేంద్రాల్లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ పధకంలో నమోదుకు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉపాధి హామీ పనులు చేసేవారు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవన పనివారు, నర్సరీలు, పాడి పరిశ్రమ కార్మికులు, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్య కార్మికులు, భవన, భవన అనుబంధ రంగాలలో పనిచేసేవారు, తాపీ మెస్త్రీలు, రాళ్లు కొట్టేవారు, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, సానిటరీ, పెయింటర్స్, టైల్స్, ఎలక్ట్రీషియన్స్, వెల్డింగ్, ఇటుక, కాంక్రీట్ మిక్సింగ్, బావుల త్రవ్వడం, చేనేత కార్మికులు, వడ్రంగులు, వార్తా పత్రికల విక్రేతలు, పాల కార్మికులు, ఆశ, అంగన్వాడీ కార్మికులు, రిక్షా కార్మికులు, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, పశు సంరక్షక కార్మికులు, చిన్న వర్తకులు, బీడీ రోలింగ్ కార్మికులు మొదలగు వారందరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ పధకంలో నమోదు చేసుకున్న ప్రతి కార్మికునికి ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన (PMSBY) క్రింద 2 లక్షల రూపాయల ప్రమాద భీమా/అంగవైకల్య భీమా ఒక సంవత్సరం పాటు ఉచితంగా కల్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈ పధకంలో చేరడానికి 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉండి, ఆదాయపు పన్ను చెల్లించని వారు, ఇపీఎఫ్, ఇఎస్ఐ సదుపాయం లేని కార్మికులు అర్హులని ఆయన అన్నారు. ఇట్టి పధకం అన్ని సి.ఎస్.సి. కేంద్రాల్లో ఉచిత నమోదుతో పాటు, స్మార్ట్ ఫోన్ ద్వారా register.eshram.gov.in వెబ్ సైట్ ద్వారానూ నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పధకంలో నమోదు ద్వారా ప్రతి అసంఘటిత కార్మికునికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డ్ (UAN) ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్డుతోనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పధకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. నమోదు సమాచారంతో ప్రభుత్వానికి సామాజిక విధానాలు, పథకాల రూపకల్పనకు సహకరిస్తుందని ఆయన అన్నారు. వలస కార్మికుల శ్రామిక శక్తిని ట్రాక్ చేసి, వారికి ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post