అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ నందు పేర్లు నమోదు చేసుకోవాలి – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ నందు పేర్లు నమోదు  చేసుకోవాలి – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులందరు e-SHRAM (ఈ-శ్రమ్) పోర్టల్ నందు తమ పేర్లు నమోదు చేసుకోవలసిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పధకాలను అందించాలని ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 26 న ఈ-శ్రమ్ ద్వారా ఉచిత నమోదు ప్రక్రిమ చేపట్టిందని అన్నారు. ఇందుకోసం వివిధ క్యాటగిరీలలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల సమగ్ర సమాచారాన్ని సేకరించి పొందుపరచుటకు సమగ్ర జాతీయ డేటా బేస్ రూపొందిస్తున్నదని అన్నారు. ఈ డేటా బేస్ ప్రామాణికంగానే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం పలు పధకాలు, విధానాలు రూపొందిస్తుందని, అలాగే వలస కార్మికులను గుర్తించి ఉపాధి కల్పిస్తుందని అన్నారు.
ఈ-శ్రమ్ లో పేర్ల నమోదు కోసం అన్ని మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయితీలలో కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లు ఏర్పాటు చేశారని, ఈ కేంద్రాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఆ వెంటనే యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబరు (UAN) గల ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పధకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింప చేయుటకు అవకాశముంటుందని అన్నారు. ఇందులో పేరు నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన క్రింద 2 లక్షల ప్రమాద భీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని ప్రతిమ సింగ్ తెలిపారు. మెదక్ జిల్లాలో 246 కామన్ సర్వీస్ సెంటర్ లు ఏర్పాటు చెయ్యగా 4,325 కార్మికులు మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములై అసంఘటిత రంగ కార్మికులందరు పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కలిగించి ప్రోత్సహించాలని ఆమె కోరారు. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో ఇద్దరు కామన్ సర్వీస్ సెంటర్ ప్రతినిధులు ఉండుటకు స్థలం, ప్రింటర్, స్టేషనరీ సమకూర్చడంతో పాటు ప్రతి రోజు పేర్లు నమోదు చేసుకుంటున్న కార్మికుల వివరాలతో కూడిన రిజిస్టర్ నిర్వహించవలసినదిగా ఆమె మునిసిపల్ కమీషనర్ల సూచించారు.

ఈ.పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ. లేని వారు మాత్రమే అర్హులని అనగా వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేస్తున్న వారు, మత్స్య కారులు,భవన నిర్మాణ రంగాలలో పనిచేసేవారు, ఆటోమొబైల్, చేతివృత్తులు, చర్మకారులు,రజకులు, స్వయం ఉపాధి పధకాలు, టైలరింగ్, పాచి పని చేసేవారు,కొరియర్ బాయ్స్ , ప్రభుత్వ పథకాలలో పనిచేసే స్వయం సహాయక సంఘాలు, అంగన్వాయిదీలు, మిడ్ డే మీల్ వర్కర్లు, విద్యా వాలంటీర్లు, హమాలీలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే వారు అసంఘటిత రంగ కార్మికులుగా పరిగణింపబడతారని ఆమె వివరించారు. 18 నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఆదాయపు పన్ను చెల్లించలేని వారు ఈ పధకంలో చేరడానికి అర్హులని ఆమె స్పష్టం చేశారు. ఈ-కె.వై.సి కలిగిన ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ కు వచ్చే ఓ.టి.పి ద్వారా లేదా బయోమెట్రిక్ ప్రింట్ లేదా ఐరిస్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ తెలిపారు.

Share This Post