అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకంలో వైఫల్యం తీరుమారకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర గ్రామీణాభి వృద్ధి పంచాయతి రాజ్ కమిషనర్ డా ఏ శరత్ తెలిపారు. బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర్ లో ఆదివారం ఆకస్మిక పర్యటన నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఆ గ్రామంలో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘ పర్యటన చేసి గ్రామంలోని పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర వాటిని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తొలుత గ్రామంలో పర్యటించిన ఆయన న్యూస్కాలర్ కాన్వెంట్ పాఠశాల నుంచి కొత్తూరు వరకు నడుచుకుంటూ వెళ్లి సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. రహదారుల వెంబడి వ్యర్దాలున్నాయని, పారిశుధ్యం లోపించినట్లు చెప్పారు. పారిశుధ్యం లోపించిందని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదేం విధుల నిర్వహణ, పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందంటూ మండిపడ్డారు. గ్రామస్థులను ఈ కార్యదర్శి మీకు తెలుసా, సక్రమంగా విధులకు వస్తున్నారా అని అడగ్గా గ్రామస్థులు మాకు తెలియదని చెప్పడంతో మరింత అసహనానికి గురయ్యారు. పంచాయతీలో పారిశుధ్య నిర్వహణ లోపం బాగా కనిపిస్తుందని, అంతేకాకుండా మొక్కల పెంపకంలోను నిర్లక్ష్యం కనిపిస్తున్నదని సక్రమంగా విధుల నిర్వహణ లేదని తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పర్యటనలో సైడ్ డ్రైన్లను పరిశీలించి పూడిక తీయడం లేదా అంటూ ప్రశ్నించారు. పర్యటనలో భాగంగా ప్రజల నివాసాలకు సైతం వెళ్లి మహిళలను పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. పారిశుధ్య నిర్వహణలో లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, మరోమారు ఇలా జరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. మళ్లీ తాను జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు పారిశుధ్య లోపం ఉండొద్దని, సమస్య తలెత్తకూడదని సూచించారు. అనంతరం గ్రామంలో పల్లెప్రకృతినవం, డంపింగ్ యార్డును సందర్శించి ప్రకృతివనంలో మొక్కలను చూసి మొక్కల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఏపీవో శ్రీలక్ష్మిని ఎన్ని మొక్కలు నాటారని ప్రశ్నించగా 4 వేల మొక్కలు నాటినట్లు చెప్పడంతో సంతృప్తి చెందని ఆయన మొత్తం 2 వేల. మొక్కలు కూడా ఉండవని, తనకు ఎందుకు అబద్దాలు చెబుతున్నారని ఏపీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 వేల మొక్కలుంటే చిట్టడవిని తలపించేలా ప్రకృతివనం కనిపిస్తుందని అలాంటిదేమీ ఇక్కడలేదన్నారు. తిరిగి మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. గ్రామంలో పల్లెప్రకృతివనంతో పాటు డంపింగ్ యార్డు నిర్వహణ కూడా సరిగాలేదని అధికారుల పనితీరును ప్రశ్నించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనఖీలు చేస్తేనే గ్రామాల్లో పారిశుధ్యం, మొక్కల నిర్వహణ బాగుంటుందని, అలాంటిదేదీ ఇక్కడ జరిగినట్లు కనిపించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రభుత్వం నిరుపేదలకు నిర్మించి పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇండ్లను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నివాసముండే ప్రజలు తమకు తాగునీరు సరఫరా చేయడం లేదని చెప్పగా స్పందించిన కమీషనర్ సత్వరమే మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీపీఓ లక్ష్మీరమాకాంత్, అడిషనల్ పీడీ సుబ్రమణ్యం, ఎంపీడీఓ వివేక్ రామ్ ఎంపీఓ సునీల్ శర్మ, డీఎల్పీవో పవన్ కుమార్, ఏపీవో శ్రీలక్ష్మి, సర్పంచ్ భూక్యా దివ్యశ్రీ, ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణరెడ్డి, కార్యదర్శి సాయి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.