ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం సింగోటం శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం జరుగుతుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం సింగోటం శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దక్షిణ యాదాద్రిగా పిలువబడే సింగోటం శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి రూ. 15 కోట్లు మంజూరు చేయగా గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, కొల్లాపూర్ శాసన సభ్యులు భీరం హర్షవర్ధన్ రెడ్డి తో కలిసి ఆలయ పునర్నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది కారాగార శిక్షలు, ఉరికొయ్యలు ఎక్కి సాధించిన భారత దేశానికి స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రజలకు వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న దేశంలో ఇప్పుడు దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బి.జే.పి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు గాని ఒక్క దేవాలయం గాని కట్టలేదు కానీ ప్రజలు, వర్గాల మధ్య గోడలు మాత్రం కడుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాలు, నిర్మించుకున్న చెరువులు చెక్కు చెదరలేదన్నారు. రాష్ట ముఖ్యమంత్రి ప్రజలకు అవసరమైన చెరువులను, ప్రజల విశ్వాసాలను గౌరవించి దేవాలయాలను పునర్నిర్మాణం పనులు చేపట్టారని కొనియాడారు. ఈ ప్రాంతం గుండా తాను వెళుతూ ప్రతిసారి సింగోటం శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం జరిగితే బావుండు అని కోరుకునేదని, ఈ నియోజకవర్గ శాసన సభ్యుడు భీరం హర్షవర్ధన్ రెడ్డి పట్టుదల కృషితో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయ పునర్నిర్మాణం కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ ఆలయాన్ని అన్ని సౌకర్యాలు ఆధునిక హంగులతో త్వరలోనే పూర్తి అయ్యేవిధంగా చూడాలని శాసన సభ్యులను కోరారు. ఇక్కడ సకల సదుపాయాలు, చుట్టుపక్కల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని కలెక్టర్ ను సూచించారు. అందుకు అవసరమైన నిధులకొఱకు ప్రతిపాదనలు పంపిస్తే ఖచ్చితంగా నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడ చాలామంది వ్యవసాయదారులు హాజరు కావడంతో ఆధునిక వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంటల పై రైతులకు సూచనలు చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు. వరికి బదులుగా మరే పంట వేసిన అంతకు ఎక్కువ లాభం ఆర్జించవచ్చని అన్నారు. యాసంగిలో పత్తి వేయడం, ఆయిల్ పామ్, పందిరి సాగు చేయాలని రైతులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ చారిత్రక దేవాలయం అయిన సింగోటం శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి 15 కోట్లు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, శాసన సభ్యులు, మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మండలం చేయాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.
కొల్లాపూర్ శాసన సభ్యులు భీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 8వ శతాబ్దంలో సింగమనాయుడు అనే రాజు సింగోటం శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుందన్నారు. కోవిడ్ సమయంలో తప్ప ప్రతి సంవత్సరం ఇక్కడ వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. కొల్లాపూర్ ప్రజల ఆరాధ్యదైవం, ఇంటి దేవుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని 1.1 ఎకరం విస్తీర్ణంలో ఆగమ శాస్త్రం ప్రకారం త్వరలోనే పునర్నిర్మాణం పూర్తి చేయించడం జరుగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణం తో పాటు భక్తులకు మౌళిక సదుపాయాలకై మరిన్ని నిధులు మంజూరు చేయించాలని మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు కృష్ణయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాసులు సైతం మాట్లాడారు. ఎంపీపీ భోజ్య నాయక్, రైతుబందు సమితి అధ్యక్షులు కె. నిరంజన్, తే.రా. స కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————-

Share This Post