ఆగస్టు 2 వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆగస్టు 2 వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————-
సిరిసిల్ల 24, జూలై 2022
——————————-
ఆగస్టు రెండు వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, ప్రజల భాగస్వామ్యం, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయం తో చేపట్టాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలపై జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయితీ సెక్రటరీ లకు జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న దృష్ట్యా ఈనెల 24 నుంచి ఆగస్టు 2 వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురుగు కాలువలు పూడిక మట్టి నిండితే తక్షణమే తీయించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామస్థాయిలో ఆరోగ్య ,ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించాలని కోరారు. రోడ్ల పక్కన గుంతల్లో నీరు నిల్వ ఉంటే ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు.కాచి చల్లార్చిన నీటిని తాగాలని పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారాన్ని రోడ్లపై వేయవద్దని, చెత్త సేకరణ వాహనాల్లోని వేయాలని కోరారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడేను క్రమం తప్పకుండా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇండ్లలోని నీటి ట్యాంకులు, చెత్తకుండీలు, పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పరంగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిన హై రిస్క్ గ్రామాలలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Share This Post