ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ముద్దు బిడ్డ : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ముద్దు బిడ్డ అని, దేశానికి స్వాతంత్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశంలో జయంతి ఉత్సవాలలో భాగంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేశారని, తెలంగాణ సాధన ఆశయంగా ముందుకు సాగారని, ఈ మహనీయుడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాసి కావడం సంతోషకరమని అన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలు భావితరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశాలలో జీవిత చరిత్ర పొందుపర్పాలని, అనుకున్న ఆశయ సాధన కోసం కష్టపడే తత్వాన్ని చూపారని తెలిపారు. 1915 సెప్టెంబర్‌ 27న ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడిలో జన్మించారని, విద్యార్థి దశ నుండే స్వాతంత్ర్యం కోసం పోరాడారని, 1940 లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి తరఫున వాదించి కేసులను గెలిపించారని, 1942లో కిట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 1952లో ఆసిఫాబాద్‌ నుంచి ఎన్నికై హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారని, తెలంగాణ కోసం 1969లో మంతి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారని, 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి సురేష్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా
నజీమ్‌ అలీఅప్సర్‌, దళిత అభివృద్ధి అధికారి, సంబంధిత శాఖల అధికారులు, పద్మశాలిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post