కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణీ, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాపూజీ చిత్రపటానికి, సిపి తరుణ్ జ్యోషి, పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ సకల జనుల సబ్బండ వర్గాల ప్రజల కోసం జీవితాంతం పోరాడడనీ గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట యోధుడిగా కీర్తి గడించారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన జీవితాంతం దేశ సేవకే అంకితం చేశారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమకారునిగా, తెలంగాణ రైతాంగ పోరాట యోధునిగా, తొలి, మలి దశల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ కర్తగానే కాకుండా రైతాంగ పోరాటం, తొలి తెలంగాణ ఉద్యమ పోరాటం సందర్భంగా జైలుపాలైన ఉద్యమకారుల తరపున ఉచితంగా వాదించిన గొప్ప న్యాయవాది అని అన్నారు.
రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ వెనుకబడినతరగతుల అభివృద్ధి కోసం ఆయనప్రత్యేకంగా కృషి చేశారని, తెలంగాణ ప్రజల కోసం తన ఆస్తులను ధార పోసి 96 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిన గొప్ప తెలంగాణ వాది అని అని అన్నారు.
కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ భావి తరాలకు స్పూర్తి ప్రదాత అని,ఆయన సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, డి ఆర్ ఓ వాసుచంద్ర, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బిసి వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి, జిల్లా అధికారులు, బిసి సంఘము నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.