ఆజాదికా అమృత్ ఉత్సవాల లో భాగంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, నల్సా అద్వర్యం లోనిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిబి. సుజయ్ (కరీంనగర్ జిల్లా)

ప్రజల ముంగిటకే  న్యాయ సేవలు

పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు

న్యాయసేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోండి

మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమంలో

జిల్లా సెషన్స్ జడ్జి ఎం. జి. ప్రియదర్శిని

పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
00000

పురుషులతో పాటు  మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని,  ఇది భారత రాజ్యాంగం కల్పించిందని,
మహిళలందరూ చట్టాలపై అవగాహన పెంపొందించు కోవాలని,  ప్రజల ముంగిటకే న్యాయ సేవలు  అందుబాటులోకి వచ్చాయని వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా సెషన్స్ జడ్జి,  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం. జి. ప్రియదర్శిని అన్నారు.

శనివారం స్థానిక రెవెన్యూ గార్డెన్స్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహిళలకు చట్టాలపై అవగాహన’ కార్యక్రమానికి ఆమే  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ముందుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ప్రియదర్శిని మాట్లాడుతూ మహిళలు టీవీ సీరియల్స్ చూడడానికి మాత్రమే పరిమితం కాకుండా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సం.లు పూర్తయిన సందర్భంగా  ఆజాది కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నా మని అన్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా  జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో  రాజ్యాంగం కల్పించిన హక్కులు,చట్టాలు,ఉచిత న్యాయ సేవల పై దేశ వ్యాప్తంగా గ్రామస్థాయి వరకు అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. జాతీయ,రాష్ట్ర, జిల్లా,మండల న్యాయ సేవాధికార సంస్ధలు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, బాధ్యతలతో పాటు,రాజ్యాంగం లోని ఆర్టికల్ 39 ఏ లో పేర్కొన్న విధంగా పేదలకు,బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు, అందరికి న్యాయం గురించి గ్రామ స్థాయి లో ప్రతి ఒక వ్యక్తికి తెలిసే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  1244 గ్రామాలకు బృందాలుగా వెళ్లి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించామని తెలిపారు. ఆస్తి, భూ తగాదాల కు సంబంధించి కేసులకు చాలా మంది ఆర్థిక స్థోమత  లేకపోయినప్పటికి అప్పులు చేసి న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన లేకపోవడం,తెలియక పోవడం వల్లనే ఆర్ధిక భారం పడుతుందని,క్రిమినల్,సివిల్ కేసుల్లో కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ద్వారా న్యాయవాది ఫీజు చెల్లించి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవా సదన్ లో,  మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం మండల జూనియర్,సీనియర్ సివిల్ జడ్జి భవనాల కోర్ట్ ప్రాంగణం లో ఉంటుందని అన్నారు.  ఆదాయం తక్కువ ఉన్న వారికి,మహిళలు అందరికి,పిల్లలు అందరి కీ,అసంఘటిత రంగంలో కార్మికులకు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని అన్నారు. మహిళా సంఘాలు గ్రామాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ఏదైనా కేసులో  మహిళలను అరెస్టు చేయాల్సి వస్తే మహిళా కానిస్టేబుల్లు  మాత్రమే తీసుకెళ్లాలని, సాయంత్రం ఆరు గంటల తర్వాత అరెస్టు చేయడానికి వీలు లేదని, అరెస్టు చేసిన తర్వాత 24 గంటల లోపు కోర్టులో హాజరు పర్చాలని తెలిపారు. ఇటువంటి వాటిపై మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సంతానం లేనివారు పిల్లలను దత్తత తీసుకో వడానికి చట్టం ప్రకారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురు కావనీ  తెలిపారు.  సోదరులతో పాటు మహిళలకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని అన్నారు. చట్టపరంగా ఉన్న హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించాలని, లేదా న్యాయసేవాధికార సంస్థ నుంచి సహాయం పొందవచ్చని, ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోర్టులో పెండింగ్ లో  ఉన్న కేసులకు సంబంధించి లోక్ అదాలత్ ద్వారా ఒకే రోజులో కేసులు పరిష్కరిస్తామని తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్రతి  పౌరుడికి పౌర హక్కు, సమానత్వం, జీవించే హక్కు ఉన్నాయని అన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు పేద ప్రజలు మహిళలు జిల్లా లేదా మండల న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయించి సహాయం పొందాలని అన్నారు. ఇప్పుడు న్యాయ సేవలు ప్రజల ముంగిటకే వచ్చాయని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లల కోసం ప్రత్యేకంగా పోక్సో చట్టం అమల్లోకి వచ్చిందని, పిల్లలపై జరిగే నేరాలకు న్యాయసేవాధికార సంస్థ నుంచి  సహాయం పొందాలని తెలిపారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  బి. సుజయు కుమార్ మాట్లాడుతూ పేద  వారికి న్యాయం అందించేందుకు గాను 1987 లో న్యాయసేవాధికార సంస్థ చట్టం ఏర్పడిందని తెలిపారు. సమస్యను తెల్లకాగితంపై రాసి ఇస్తే ఎవరి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో వారిని పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కళాకారుల బృందం కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి

Share This Post