ఆడవారు అన్ని రంగాల్లో మగవారి కంటే ఎక్కువగా రాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ఆడవారు అన్ని రంగాల్లో మగవారి కంటే ఎక్కువగా రాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్య శాఖచే ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులను శాలువతో సత్కరించి, మిఠాయిలు అందజేశారు. సాధారణ ప్రసవం, తల్లి పాల విశిష్టతపై అవగాహన పాట, చిన్న నాటిక రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ కుల, మతాలకతీతంగా రాష్ట్ర ప్రజలందరూ జరుపుకొనే పండుగ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పండుగలకు ప్రోత్సాహం ఇస్తుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మకు చీరెల పంపిణీ, ప్రతీ గ్రామంలో బతుకమ్మ ఘాట్ ల ఏర్పాటుచేస్తుందని అన్నారు. ఆడపిల్లలపై చిన్న చూపు ఉండేదని, అది మనసులో ఉండిపోయిందని అన్నారు. ఈ భావన ఎంత తప్పో ప్రపంచానికి ఇప్పుడు తెలిసొచ్చిందని ఆయన అన్నారు. అమ్మాయిలు ప్రతి రంగంలో రాణిస్తున్నట్లు, శాస్త్ర, సాంకేతిక, సైనిక, రోదసీ రంగాల్లో ఆడవారు ఉన్నారన్నారు. క్రీడల్లో మగవారికంటే ఆడవారే ఎక్కువగా ఉన్నారన్నారు. ఖమ్మం జిల్లాలో పెళ్లై పిల్లల కోసం చూస్తున్న 5 వేలకు పైగా జంటలు ఉన్నట్లు, పిల్లల కోసం లక్షలు పెట్టి పలు వైద్యాలు చేయించుకునే వారున్నట్లు ఆయన అన్నారు. అమ్మాయి మహాలక్ష్మీ అని, మనమందరం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆయన అన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు.
అంతకుముందు కలెక్టర్ ప్రధాన ఆసుపత్రిలోని ప్రసూతి వార్డుల్లో ఆడపిల్ల పుట్టిన తల్లులకు శాలువాలతో సత్కరించి, మిఠాయిలు అందించారు. కేసీఆర్ కిట్ ను తల్లులకు అందజేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది డబ్బులు అడుగుతున్నట్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, ఆర్ఎంఓ కు విచారణ చేసి, సమగ్ర నివేదిక సమర్పించవలసినదిగా కలెక్టర్ ఆదేశించారు. డబ్బులు తీసుకున్న సిబ్బందిని విధుల నుండి టర్మినేట్ చేయాలని ఆయన అన్నారు. ఆసుపత్రికి పేదవారే వైద్యం కోసం వస్తారని, వారిని ఇబ్బంది పెడితే సహించేది లేదని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, ప్రసూతి విభాగం డా. కృప ఉషశ్రీ, ఆర్ఎంఓ, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post