ఆదర్శంగా నిలిచిన అంతర్గాం గౌడ సొసైటీ:: కెడిసిసి చైర్మన్ కోండూరి రవీందర్ రావు

పత్రికాప్రకటన.2

తేదిః 12-10-2021
ఆదర్శంగా నిలిచిన అంతర్గాం గౌడ సొసైటీ:: కెడిసిసి చైర్మన్ కోండూరి రవీందర్ రావు
జగిత్యాల అక్టోబర్ 12:- జగిత్యాల జిల్లా అంతర్గం గ్రామ గౌడ సొసైటీ ఆదర్శంగా నిలిచిందని కెడిసిసి బ్యాంకు చైర్మన్ కోండూరి రవీందర్ రావు అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం గ్రామంలో మంగళవారం గీత పారిశ్రామిక సహకార సంఘానికి కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ రుణం అందించే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ,స్థానిక ఎమ్మెల్యే, జెడ్పి ఛైర్పెర్సన్ల తో కలిసి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ పర్యటనలో మొదట గ్రామంలో పెంచిన ఈత వనంలోని మొక్కల ఎదుగుదలను పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2005 లో 70 కోట్ల నష్టం తో ఉన్న బ్యాంకు ప్రస్తుతం ఈ సంవత్సరం 50 కోట్లు లాభం సంపాదించే స్థాయికి వచ్చిందని, అదే దిశగా గీత పారిశ్రామిక సంఘం సైతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి సమృద్ధి స్థాయిలో లో నీరు అందుబాటులో ఉండేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రపంచంలో అత్యదికంగా మానవ వనరు ఉన్న భారతదేశంలో ప్రతిఒక్కరికి ఉద్యోగం కల్పించడం అసాద్యమని, తెలంగాణలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండాలన్న సంకల్పంతొ కులవృత్తులను అభివృద్దికి ప్రభుత్వం పూర్తిసహాకారాన్ని అందిస్తుందని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల దిశగా ఆలోచించి, పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని కోరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం కొనుగోలు చేయడాన్ని నిరాకరించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న విధంగా ఆయిల్ పామ్, కందులు, పెసలు వంటి ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులు దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈత వనాల పెంచడం ద్వారా గీత పారిశ్రామిక సహకార సంఘాలకి, చదువుకున్న యువతకు ఉపాధితో పాటు మంచి ఆదాయం లభిస్తుందన్నారు. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యం కరమైన కలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదులో మూసివేసిన కళ్ళు కాంపౌండ్ తిరిగి ప్రారంభించారని, గౌడ కులస్తుల అభివృద్ధి కోసం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బ్యాంకు ద్వారా ఒక్కో రైతుకు 50లక్షల వరకు ఋణాన్ని అందించడం జరుగుతుందని, నర్సరీలను అభివృద్ది దిశగా రైతులు అలోచించాలని, అందుకు బ్యాంకు ద్వారా ఋణాన్ని , ఉద్యానపంటల కింద 12% నికి మాత్రమే అందించడం జరుగుతుందని తెలియజేశారు. జగిత్యాల జిల్లా సంఘాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రతి పైస వినియోగించుకొని, తిరిగి చెల్లించడంలొ కూడా ముందుండాలని, పథకం ఏదైన మీ అభివృద్దికి ఎళ్లవేళలా తోడుంటామని, జిల్లాలో అయిల్ ఫాం ఇండస్ట్రీ కూడా రాబోతుందని పేర్కొన్నారు. రైతుల శ్రమకు ఫలితం అంది, పండించిన పంటకు మంచి ధర లభించాలంటే రైతులు సంఘటితం అయి శాసించే స్థాయికి రైతులు ఎదగాలని. ప్రతిఒక్కరు బ్యాంకులో ఖాతాలను పొందాలని, అనుకోని పరిస్థితులు ఎదురైతె వారికి కుటుంబ పెద్దకు ఎదైన జరిగితె వారికి ఇన్స్యూరెన్స్ అందించడం జరిగుతుందని తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం నీరు సమృద్ధిగా అందుబాటులో ఉందని, తెలంగాణ వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించే దిశగా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కుల వృత్తుల పెంపొందించే దిశగా గౌడ కులస్తుల కోసం సైతం ఎత్తున ఈత మొక్కలు నాటుతున్న మని, మన జిల్లా పరిధిలో ఇప్పటివరకు 29 లక్షల ఈత మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. ఈత మొక్కల పెంపొందించే విషయంపై ప్రజలకు అవగాహన పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ దావత్ అంత మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన కల్లు విక్రయానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో దుకాణాల్లో కూల్ డ్రింక్ విక్రయించే మాదిరి నీరా బాటిల్ లో సైతం విక్రయించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుందని ఆమె తెలిపారు. బ్యాంకు వారు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ గీత పారిశ్రామిక సంఘం వృద్ధిలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు. గౌడ కులస్తుల సంక్షేమానికి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి పడి మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం అందిస్తున్నామని, గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల సహాయం అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వృత్తి నైపుణ్యం పెంపొందించుకుంటూ అధిక ఆదాయం ఆర్జించే దిశగా పనిచేస్తున్న గీత పారిశ్రామిక సహకార సంఘాన్ని కలెక్టర్ అభినందించారు. బ్యాంకుల నుండి తీసుకుంటున్న 40 లక్షల రుణం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ 4 కోట్ల వరకు సంపాదించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.అంతర్గం గ్రామ కూడలిలో హై మాస్ లైట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని తెలియచేసారు.
గ్రందాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణకే అంతర్గాం గ్రామం రోల్ మాడల్ గా నిలిచిందని, కులాలు అభివృద్ది చెంది వారి ఆర్థిక స్థితిగతలు మారాలన్న సంకల్పంతో రాష్ట్రముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని, అందులో బాగంగా గౌడకులస్థుల కొరకు చెట్టునుండి జారిపడిన వారికి 5లక్షల పరిహారం, ఆసుపత్రి ఖర్చులకు 10వేలు అందించడంతో పాటు గౌడ కులస్థులకు పించను కూడా అందించడం జరుగుతుందని, హైదరాబాద్ గచ్చిబౌళిలో గౌడకులస్థుల అభివృద్దికి 5ఎకరాల స్థలంతో పాటు 5కోట్లు మంజూరు చేసి అభివృద్దికి అకాంక్షించారని, రోళ్ మోడల్ గా నిలిచిన గ్రామంలోని సోసైటి చూసి మరికొంత మంది ముందుకు వస్తున్నారని, స్వచ్చమైన కల్లు, నీరా ను అందించడంలో అంతర్గాం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని పేర్కోన్నారు. కరోనా సమయంలో స్వచ్చమైన కల్లును అందించడం జరిగిందని పేర్కోన్నారు. అనంతరం గీత పారిశ్రామిక సంఘం వారికి 40 లక్షల రుణ చెక్కును అందించారు. అనంతరం వారిని గౌడ కుల సంఘం వారు సన్మానించారు.
సి.ఈ.ఓ., కె.డి.సి.సి. బ్యాంక్, బ్యాంక్ అధికారులు, మేనేజర్లు, గౌడ సంగం నాయకులు, జితేందేర్రావు, మహిపాల్రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ సర్పంచ్ నారాయణ, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

Share This Post