ఆదర్శగ్రామం గా మార్చడానికి కృషి చేద్దాం- ఆదిలాబాదు పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు.

సెప్టెంబర్ 02, 2021ఆదిలాబాదు:-

గ్రామం లోని సమస్యలను పరిష్కరించి ఆదర్శగ్రామం గా మార్చడానికి కృషి చేయడం జరుగుతుందని అదిలాబాదు పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు. గురువారం రోజున బోథ్ మండలం వజ్జర్ గ్రామపంచాయితీ లోని మహాదుగూడ లో ఏర్పాటు చేసిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, సెల్ టవర్ ఏర్పాటు చేయాలనీ, పోడు భూముల పట్టాల సమస్యలను పరిష్కరించాలని, అంగన్వాడీ కేంద్రానికి, పాఠశాలకు గదులు, ప్రహరీ గోడ నిర్మించాలని, సీసీ రోడ్లు వేయాలని కోరారు. ఈ సందర్బంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, గ్రామాల్లోని సమస్యలను గ్రామస్తులంతా చర్చించి పంచాయితీ కార్యదర్శికి వివరించడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన నాల్గవ విడత 2019-20 పథకంలో భాగంగా ఆదర్శ గ్రామాలుగా మార్చడానికి వజ్జర్ గ్రామపంచాయితీ లోని ప్రస్తుతం రెండు గ్రామాలను తీసుకోవడం జరిగిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థం అయ్యేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, వాటి ద్వారా వారికీ లబ్ది చేకూరుతుందని అధికారులను సూచించారు. త్వరలో సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, బ్యాంకు అధికారులు మహిళా లకు ఇచ్చే రుణాలకు సహకరించాలని అన్నారు. వైద్యం కోసం సబ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కరోనా వాక్సిన్ ను ప్రతి ఒక్కరు తీసుకోవాలని, వైద్య సిబ్బంది గ్రామస్తులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, మారుమూల గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం రూపొందించడం జరిగిందని అన్నారు. గ్రామస్తులు తెలిపిన సమస్యలను తన పరిధిలో ఉన్నవి ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని, మిగితావి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గ్రామపంచాయితీ లో నర్సరీ, క్రిమిటోరియం, డంపింగ్ యార్డ్, రైతు వేదికలు ఏర్పాటు చేయడం, ట్రాక్టర్, ట్రాలీ ఇవ్వడం జరిగిందని అన్నారు. గ్రామం లోని పరిసరాలను, పల్లె ప్రకృతి వనాన్ని చూసి ఆహ్లద కరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ మాట్లాడుతూ, ఆసరా పెన్షన్ లు అందని వారు అధికారులకు తెలియజేయాలని, అవే కాకుండా ఏ సమస్యలున్నా తెలియజేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం లో భాగంగా అప్రోచ్ రోడ్ లు వేసుకోవచ్చని, యువకులకు అవకాశం కల్పించాలని ఎంపీడీఓ కు తెలిపారు. గ్రామసభకు అందరు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో  జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ ఈ ఉత్తమ్, ఎంపీడీఓ రాధ, ఎంపీపీ తుల శ్రీనివాస్, జెడ్పీటీసీ సంధ్యారాణి,  సర్పంచ్ భూం బాయి, గ్రామ పటేల్ లు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post