ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీల దినోత్సవం

ఆగష్టు 09, 2021ఆదిలాబాదు:-

జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి కొమురం భీమ్ ను స్మరిస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రోజున ఉట్నూర్ లోని కొమురం భీమ్ కాంప్లెక్ లో గల కొమురం భీమ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిధులు, నియామకాలు, నీళ్ల కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగిందని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, జోడే ఘాట్ లో 25 లక్షల రూపాయలతో మ్యూజియం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఆదివాసీల సమస్యలు జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆదివాసుల కోసం పోరాటం చేసిన స్వర్గీయ సిడాం శంభు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకొని సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాల నుండి పాఠశాలలు, అంగన్వాడీలు మూత పడ్డాయని, ఏజెన్సీ ఏరియా లో విద్య ప్రమాణాలు ముందుకు సాగే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కోవిడ్ మొదటి, రెండు దశల్లో ప్రజలను చైతన్య పరిచి జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకున్నామని, మూడవ దశ రానున్నట్లు పలువురు మేధావులు తెలియపరుస్తున్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని మాస్క్ లు ధరించాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలోని ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చదువు తోనే అభివృద్ధి జరుగుతుందని, ఆదివాసీల సమస్యలను ఏ సమయం లోనైనను జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని, ఆ సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని అన్నారు. వచ్చే మాసాలలో పెద్ద ఎత్తున పోలీస్ రిక్రూట్ మెంట్ ప్రభుత్వం నిర్వహించనున్నదని, ఉద్యోగాల కోసం చూసే వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఇప్పటినుండే పోటీ పరీక్షలలో పాల్గొనడానికి కృషి చేయాలనీ యువతకు పిలుపునిచ్చారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏజెన్సీ లో పనిచేయడం అరుదైన అవకాశామని, అదృష్టం అని అన్నారు. దురదృష్ట వశాత్తు గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ కారణంగా ఆశించిన పనులు చేపట్టలేక పోయామని, అయినప్పటికీ గిరిజనులకు ఆరోగ్య విషయంలో సహకారం అందించామని, అదేవిధంగా గిరిజనుల సమస్యలు తన దృష్టికి వచ్చిన వాటిని తన పరిధిలోని వాటిని పరిష్కరించమని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వలన మల్లాపూర్ గ్రామంలో 100 ఇల్లు కొట్టుకు పోయాయని, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారందరికీ రేకులను, మౌలిక వసతి సౌకర్యాలు కల్పించామని అన్నారు. వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించనున్నదని తెలిపారు. ITDA ఆధ్వర్యంలో గతంలో 500 మంది గిరిజన యువతను పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ నిమిత్తం ఎంపిక చేయడం జరిగిందని, కోవిడ్ కారణంగా నిలిచి పోయాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఒక గ్రామంలో ప్రభుత్వం ఉద్యోగం సంపాదించిన వ్యక్తిని చూసి మరికొందరు స్ఫూర్తిగా తీసుకొని పోటీ పరీక్షలకు సిద్ధం అవుతారని అన్నారు. గిరిజనుల కోసమే పనిచేయడానికి అధికార యంత్రాంగం ఉందని, ఏ సమయం లోనైనను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. సిడాం శంభు కుమారునికి ITDA తరపున సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జయవంత్ రావు, జిల్లా సర్ మేడి దుర్గుపటేల్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంధ్యారాణి, ITDA పరిపాలనాధికారి రాంబాబు, ఆదివాసీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post